Andhra PradeshNews

రూటు మార్చిన చంద్రబాబు.. వాళ్లకే టికెట్లు

◆ నియోజకవర్గాల ఇన్‎‎చార్జ్‎ల పని తీరుపై పూర్తిస్థాయి దృష్టి
◆ సక్రమంగా పనిచేయని నేతలకు హెచ్చరికలు
◆ పనితీరు ఆధారంగానే ఈసారి టికెట్లు కేటాయింపు
◆ వరుసగా నియోజకవర్గాల వారీగా అంతర్గత సమావేశాలు

తెలుగుదేశం పార్టీ అధిష్టానం గతానికి భిన్నంగా పార్టీలో కొత్త సంస్కృతి విధానాలకు తెరతీసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గతానికి భిన్నంగా చంద్రబాబు వ్యవహార శైలి మారింది. ఆయన నిర్ణయాలు వేగంగా దూకుడుగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. విధానపరమైన నిర్ణయాలతో పాటు పార్టీలో పదవులు, టికెట్లు కేటాయింపు ఈసారి పూర్తిగా ప్రజాదరణ ఉన్న నేతల పనితీరు ఆధారంగానే ఉంటుందని స్పష్టమైన సంకేతాలు పంపిస్తున్నారు. ఒక సమగ్రమైన ప్రణాళికలతో ఎన్నికలకు సిద్ధమవుతున్న చంద్రబాబు నియోజకవర్గాల ఇన్‎‎చార్జ్‎ల పనితీరుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఆయా నియోజకవర్గాల ఇన్‎‎చార్జ్‎లతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఆయన వద్ద ఉన్న సమగ్ర సమాచారంతో ప్రతి అంశాన్ని నేతలకు వివరిస్తూ మార్పులు చేర్పులకు సిద్ధమవుతున్నారు. నేతలపై ఉన్న ప్రజాదరణ పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనటం ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్లటం లాంటి అంశాల వారీగా నేతల పనితీరును బట్టి వారికి అభినందనలు తెలుపుతూ, సక్రమంగా పనిచేయని వారిని హెచ్చరిస్తూ ముందుకు వెళ్తున్నారు.

సమర్థవంతంగా పనితీరు కనపరచని నేతలను ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ అసలు ఎన్నికలకు మీరు సిద్ధంగా ఉన్నారా లేక ఆ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయం చూసుకోమంటారా అంటూ వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. అదే సమయంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు నేతల ఒంటెద్దు పోకడలు తదితర అంశాలపై కూడా చంద్రబాబు సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గ్రూపు రాజకీయాలను నియంత్రించేందుకు ముఖ్య నేతలను రంగంలోకి దించి పరిస్థితులు చక్కదిద్దె ప్రయత్నాలు చేస్తున్నారు. ముక్కు సూటిగా ఎలాంటి మొహమాటానికి తావు లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేస్తున్నారు. మరోవైపు అంతర్గత సర్వేలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ నేతల పనితీరులో ఎలాంటి మార్పు వచ్చిందన్న అంశాన్ని కూడా సమగ్రంగా పరిశీలిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనని నేతలను మందలిస్తూ వారి పనితీరు కూడా మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు. నియోజకవర్గ ఇన్‎‎చార్జ్‌లు పార్టీ శ్రేణులను, కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాలని ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

కేవలం పనితీరు ఆధారంగానే ఈసారి ఎన్నికలకు టికెట్లు కేటాయింపు ఉంటుందని అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు ఇన్‎‎చార్జ్‎లతో చంద్రబాబు అంతర్గత సమావేశాలు నిర్వహించి వారికి దిశా నిర్దేశాలు చేశారు. కుప్పంను కూడా గెలిచి తీరుతాం అని జగన్ సవాల్ విసరటంతో ఎలా అయినా ఈసారి ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలతో చంద్రబాబు దూకుడుగా ఉన్నారు. తనకున్న అపారమైన రాజకీయ అనుభవంతో ఈసారి ఎన్నికల్లో వైసీపీని మట్టి కరిపించాలని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ ముందుకు వెళ్తున్నారు. గతానికి భిన్నంగా చంద్రబాబు వ్యవహార శైలిలో పూర్తిగా మార్పు వచ్చిందని ఆ పార్టీ నాయకులు కూడా అంటున్నారు. మరి గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న చంద్రబాబు సక్సెస్ అవుతారా ? వేచి చూడాల్సి ఉంది.