మా పాలన చూసి చంద్రబాబుకు నరాలు చిట్లి పోయాయి:మంత్రి రోజా
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పాలన చూసి చంద్రబాబుకు నరాలు చిట్లి పోయాయంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఛార్జ్‌షీట్‌ను ఆమె పిచ్చికి పరాకాష్టగా అభివర్ణించారు. 600 హామీలు ఇచ్చి, ఆరు హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబుని, ముఖ్యమంత్రి సంతకాలకు విలువ లేకుండా చేశారంటూ దుమ్మెత్తి పోశారు. ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన వ్యక్తి బోండా ఉమా అని విమర్శించారు.కాగా, మంత్రి రోజా తిరుపతిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు? అని ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి మోసగాడు దేశంలోనే ఎక్కడా లేడని ఎద్దేవా చేసారు. వాలంటీర్ వ్యవస్థతో లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు అందుతున్నాయని సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98.5శాతం నెరవేర్చారని ఉద్ఘాటించారు. జగనన్న ప్రభుత్వం తీసుకువచ్చిన అమ్మఒడి పై ఇష్టానుసారం మాట్లాడి.. ఇప్పుడు అమ్మకు వందనం అంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పథకాలు ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించారు.