వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఏపీలో వైసీపీ పార్టీ ఇటీవల కొన్ని జిల్లాల వైసీపీ ఇన్‌ఛార్జ్‌లను మార్చిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ రోజు మంగళగిరి పార్టీ ఆఫీసులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలోని ప్రజలను వైసీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. దీంతో ఏపీ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని అందుకే వైసీపీ పార్టీ ఇన్‌ఛార్జ్‌లను మార్చిందన్నారు. బీసీలపై వైసీపీకి అంత ప్రేమ ఉంటే..పులివెందుల సీటు బీసీలకు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మరోవైపు గతంలో మాదిరిగా టీడీపీ అభ్యర్థుల ఎంపిక ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు కుప్పంలో కూడా ప్రజాభిప్రాయం తీసుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ నుంచి ఎవరైనా టీడీపీలోకి వస్తే పరిశీలిస్తామన్నారు.ఈసారి జగన్ 150 మందిని మార్చినా గెలవలేరని..ఇప్పటికే జగన్‌పై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందన్నారు. దీంతో ఈసారి వైసీపీకి డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితి వస్తుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

