Andhra PradeshHome Page Slider

ప్రజలకు చేరువయ్యేందుకు చంద్రబాబు కొత్త వ్యూహం

• కుటుంబ సాధికార సారథులను నియమించేందుకు రంగం సిద్ధం
• రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు
• ప్రతి 30 కుటుంబాలకు సారధి నియామకం
• రెండు నెలల్లో కొత్త వ్యవస్థ ఆరంభం

ఏపీలో రాబోవు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కొత్త వ్యూహానికి ఆయన పదును పెడుతున్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు పార్టీని మరింత చేరువ చేసేందుకు ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థకు దీటుగా కుటుంబ సాధికారసారుదులను నియమించేందుకు రంగం సిద్ధం చేశారు.

ప్రజలకు మరింత అండగా నిలిచేందుకు వారి సమస్యలపై తక్షణమే స్పందించేందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సాధికార సారథి నియామకాలు చేపట్టబోతుంది. రాష్ట్రంలో ప్రతి 30 కుటుంబాలకు ఒక కుటుంబ సాధికారసారధిని ఆ పార్టీ నియమించనుంది. వీరంతా పార్టీ విధానపరమైన నిర్ణయాలను వారి పరిధిలోని కుటుంబాలకు తెలియజేయడంతో పాటు కార్యక్రమాలు భవిష్యత్తు అంశాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నియామకాలను పూర్తిచేసి రెండు నెలల లోపు ఈ కార్యాచరణను పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి మూడువేల మంది సాధికార సారధులను చంద్రబాబు నియమించబోతున్నారు.

ఈ నియామకాల్లో 50% మహిళలకు అవకాశం కల్పించనున్నారు. ఈ పార్టీ సారధులంతా తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకొని డిజిటల్ రూపంలో డేటాను సేకరిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పార్టీ దృష్టికి తీసుకెళ్తారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం ద్వారా సూక్ష్మస్థాయి మేనిఫెస్టో రూపకల్పనకు ప్రణాళికలు రూపొందిస్తారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సాధికార సారధి వారి పరిధిలోని కుటుంబాల ప్రగతికి అవసరమైన చర్యలు తీసుకునేలా పనిచేస్తారు. బూత్ లెవెల్ లో ప్రతి ఇంటికి ఈ సారధులు వారదులుగా పని చేస్తారు. పార్టీలో ఉన్న సెక్షన్ ఇన్చార్జలందరినీ కుటుంబ సాధికార సారదులుగా పిలవనున్నారు. అవసరమైన చోట్ల నియామకాలు చేపట్టే బాధ్యతలను కూడా వీరికి అప్పగించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారధి విభాగం ఏర్పాటు చేయనున్నారు పార్టీకి ప్రజలకు మధ్య మరింత అనుసంధానం కోసం ఈ విభాగం పని చేయనుంది.