Andhra PradeshHome Page Slider

చంద్రబాబుకు అలర్జీ…జైలులో స్వల్ప అస్వస్థత

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆయన తాజాగా చర్మ సంబంధిత అలర్జీకి గురయ్యారు. గురువారం తనకున్న ఆరోగ్య సమస్యలను జైలు వైద్యాధికారి దృష్టికి చంద్రబాబు తీసుకువచ్చారు. గడిచిన వారం రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవటం వల్ల చంద్రబాబు అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఎండ వేడిమి ఉక్క పోతతో డిహైడ్రేషన్ కు గురికావడంతో చంద్రబాబుకు చర్మ సంబంధిత ఎలర్జీ సోకినట్లుగా వెళ్ళడైంది. దీంతో తన అనారోగ్య సమస్యలను ఇన్చార్జి జైలు సూపరిండెంట్ రాజకుమార్ కు చంద్రబాబు సిబ్బంది ద్వారా తెలియజేశారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ జైల్ అధికారులు , రాజమండ్రి జిజిహెచ్ సూపరింటెండెంట్ కు చంద్రబాబు వైద్య నిమిత్తం చర్మవ్యాధి నిపుణులను పంపించాలని కోరారు. ఈ పరిస్థితుల్లో జైలు అధికారులు చంద్రబాబు అనారోగ్య సమస్యలకు ట్రీట్మెంట్ అందించేందుకు ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లతో కూడిన ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు అస్వస్థతకు గురైన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.