అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత మరో గోద్రా ఘటనకు ఛాన్స్- థాక్రే
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కోసం దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న ప్రజల “తిరిగి ప్రయాణం”లో “గోద్రా లాంటి” సంఘటన జరగవచ్చని శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం పేర్కొన్నారు. ఫిబ్రవరి 27, 2002న, సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో అయోధ్య నుండి తిరిగి వస్తున్న “కర సేవకులు” గుజరాత్‌లోని గోద్రా స్టేషన్‌లో దాడి చేయబడ్డారు. వారి రైలు కోచ్‌ని తగులబెట్టారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లకు దారితీసిన మరణాలకు దారితీసింది. “బస్సులు, ట్రక్కులలో రామాలయ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రజలను ఆహ్వానించే అవకాశం ఉంది. వారి తిరుగు ప్రయాణంలో, గోద్రాలో జరిగినట్లుగానే సంఘటన జరగవచ్చు” అని జల్గావ్‌లో థాక్రే అన్నారు.

లోక్‌సభ ఎన్నికలకు నెలరోజుల ముందు జనవరి 2024లో రామమందిరం తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ్. బీజేపీని ప్రజలు విశ్వసించనందున, సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి దిగ్గజాలను నమ్ముకున్నారని ఉద్ధవ్ ఆరోపించారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు ఇప్పుడు తన తండ్రి బాల్ థాక్రే వారసత్వాన్ని క్లెయిమ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ – ఆర్‌ఎస్‌ఎస్‌లకు వారి సొంత విజయాలు లేవని… సర్దార్ పటేల్ భారీ విగ్రహం కాదని… ఆయన సిద్ధాంతాలను పాటించాలన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలపడం ద్వారా బాల్ ధాక్రే ఆదర్శాలను వదిలిపెట్టి ముఖ్యమంత్రి అయ్యారని బిజెపి తరచుగా ఆరోపిస్తోంది. గత ఏడాది జూన్‌లో శివసేన విడిపోయిన తర్వాత ఈ దాడులు మరింత ఉధృతమయ్యాయి. పార్టీ వ్యవస్థాపకుడి వారసత్వానికి రెండు వర్గాలు తమను తాము నిజమైన వారసులమని పిలుచుకోవడం ప్రారంభించాయి. బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన బాల్ థాక్రే హిందుత్వానికి నిజమైన అనుచరులమని చెప్పుకుంటున్నాయి.

