ఛలో కాణిపాకం … అక్కడే తేల్చుకుందాం రండి !
సవాళ్ళు ప్రతి సవాళ్ళుతో మాధవ్ వ్యవహారం కాణిపాకం చేరింది. మళ్ళీ ఓటుకు నోటు వ్యవహారమూ తెరపైకి వచ్చింది. వాస్తవమేంటో .. నిజమేంటో ఆ గణపతి ముందే తేల్చుకుందాం రండంటూ .. అటు మాధవ్.. ఇటు టీడీపీ వర్గాలు సవాళ్ళు విసురుకున్నాయి. దీంతో వేడి తగ్గడం లేదు. విమర్శలూ ఆగడం లేదు. అంశమూ మారడం లేదు. వీడియోల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. పాత విషయాలే కొత్తగా తెరమీదకు వస్తున్నాయి. ఇప్పుడంతా ఆ కాణిపాకం గణపతి నెత్తిన పెట్టారు. అక్కడే తేల్చుకుందాం..మీ నాయకుణ్ణి తోలుకురండి అంటూ మాధవ్ .. తనదైన స్టైల్లో టీడీపీ నేతలకు సవాల్ చేశారు. మధ్యలో ఆయన వ్యవహారం ఎందుకంటూ టీడీపీ వారు మండిపడుతున్నారు. ముందు రాజీనామా చేసి ప్రజల్లో నీ నిజాయితీ ఏంటో నిరూపించుకో అంటూ టీడీపీ వాళ్ళు సలహా ఇస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం అగ్ని గుండంలా మండుతోంది.

గోరంట్ల పైనే టీడీపీ గురి పెట్టింది. ఆయన వ్యవహారం తేలే వరకు వదిలేదే లేదంటోంది. ఆయన నిజాయితీ నిరూపించుకోవాలంటే ఛలో కాణిపాకం అంటోది. ఆయనే కాదండోయ్ .. ఆయనతో పాటు సీఎం జగన్ కూడా వచ్చి ప్రమాణం చేయాలని టీడీపీ సవాల్ చేస్తోంది. ఈ వ్యాఖ్యలు అగ్గి రగిల్చాయి. వైసీపీ కూడా అదే స్ధాయిలో దాడికి దిగింది. జరిగిందేంటో.. వాస్తవమేంటో.. నిజమేంటో .. నేను ప్రమాణం చేసి చెబుతా.. మరి మీ నాయకుడు రెడీయా అంటూ టీడీపీ వారికి సవాల్ విసిరారు గోరంట్ల మాధవ్. వారు చూపుతున్న వీడియో ఫేక్ అని తాను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు కూడా ప్రమాణం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ ఆసక్తిగా మారింది. విషయమంతా కాణిపాకం గణపతి నెత్తిన పెట్టేసి దండం పెట్టాలని భావిస్తున్నారు. నోటికి పని చెప్పి, విమర్శలకు పదును పెట్టి, ఎవరికి వారే వాగ్బాణాలు దూస్తున్నారు.

కాణిపాకంలో ప్రమాణాలే కాదు.. శీలపరీక్షలకు కూడా సిద్ధం కావాలని టీడీపీ అంటోది. ఆయన శీలవంతుడు, నిజాయితీ పరుడు అయితే పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాల్ విసిరారు టీడీపి నేతలు. మాధవ్ వీడియో నిజమైనదేనని అమెరికా ల్యాబ్ ధృవీకరించిందని నొక్కిచెప్పారు. అది ఫేక్ అంటున్న పోలీసులు ..అసలైన వీడియో దొరికితే వాస్తవాలు నిగ్గు తేలతాయని చెబుతున్నారు. అయితే ఒరిజనల్ వీడియో ఏమైందో బయటపెట్టాలని టీడీపీ వాదిస్తోంది. చూస్తుంటే ఇదంతా ఓ గేమ్ లా మారుతోంది. ఎప్పటెప్పటివో వీడియోలు, ఆడియోలను బయటకు తెస్తున్నారు. లోకేష్, బాలకృష్ణలకు చెందిన కొన్ని ఫోటోలను , ఆడియోలపై ఏం సమాధానం చెబుతారంటూ మాధవ్ ప్రశ్నిస్తున్నారు. తన నిజాయితీని నిరూపించుకోవడానికి సిద్ధమే .. మీ నిజాయితీని నిరూపించుకోవడానికి మీరూ సిద్ధమా అంటూ ప్రతి సవాల్ విసిరారు మాధవ్.

ఈ వ్యవహారంలో పోలీసులు రెడీ అవుతున్నారు. ఈ వీడియోని సృష్టించి బయటకు తెచ్చిన వారిపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీలో అందరూ ఇప్పుడు మాధవ్ నే టార్గెట్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపైనే స్పందిస్తున్నారు. దీంతో సర్కార్ సీరియస్ గా ఉంది. దీంతో మాధవ తరపు నుండి తమ కిందిన ఫిర్యాదులను పరిగణలోకి తీుకుని చర్యలు తీసుకునేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారని తెలుస్తోంది. స్ట్రాంగ్ కేసులతో ఈ వ్యవహారానికి చెక్ పెట్టాలని సర్కార్ భావిస్తోంది. చూద్దాం.. ఏం జరగబోతోందో.

