ఇండిగో వైఫల్యానికి కేంద్ర విధానాలే : రాహుల్ గాంధీ
ఇండిగో ఎయిర్‌లైన్‌లో మూడు రోజులుగా తలెత్తిన సమస్యలతో దేశవ్యాప్తంగా ప్రయాణికులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. వేల సంఖ్యలో విమానాలు రద్దు కావడం, మరెన్నో ఫ్లైట్ల టైమ్‌లు మారడం వల్ల ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం నెలకొంది. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలే ఈ సంక్షోభానికి కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఈ సమస్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో ఒక ఆర్టికల్‌ను షేర్ చేస్తూ, “ఇండిగో ఫియాస్కో ప్రభుత్వం నడిపిస్తున్న ‘మోనోపొలీ మోడల్’ ఫలితం ఇదని ఆయన తెలిపారు. విమానాల ఆలస్యం, రద్దు కారణంగా సాధారణ భారతీయులు మళ్లీ ఇబ్బందుల్లో పడతారని ఆయన పేర్కొన్నారు. దేశానికి నిష్పక్షపాత పోటీ అవసరం, మ్యాచ్‌ఫిక్సింగ్ లాంటి మోనోపొలీ కాదు” అని రాహుల్ విమర్శించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దేశం భయం, స్వేచ్ఛా వ్యాపార వాతావరణం మధ్య ఒక సందిగ్ధంలో నిలిచిందని ఆయన అన్నారు. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ‘మోనోపొలీ ఒత్తిడి’తో భారత్‌ను బలహీనపరిచిందని, నేడు కొంతమంది పారిశ్రామిక వర్గాలు అదే విధంగా పరిస్థితిని మలుస్తున్నాయని ఆయన వివరించారు. వారు సంపాదిస్తున్న సంపద దేశంలో ఆర్థిక అసమానతను మరింత పెంచుతోందని రాహుల్ గాంధీ అన్నారు.
ప్రస్తుతం వ్యాపారులకు ఫోన్‌లో మాట్లాడటానికే భయమొస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఐటీ, సీబీఐ, ఈడీ దాడుల భయంతో అనేక వ్యాపారాలు మూతపడుతున్నాయని, మూలధనం నిలిచిపోతుందని ఆయన తెలిపారు. దేశంలో నిష్పాక్షిక పోటీతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న కొన్ని కంపెనీలను ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. బలహీనులను రక్షించడం తన రాజకీయాల ధ్యేయమని, ఇప్పుడు వ్యాపార వర్గం కూడా అన్యాయానికి గురవుతోందని రాహుల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ వ్యాపారాన్నీ ఇతరుల ఖర్చుతో ప్రోత్సహించకూడదని, బ్యాంకులు పెద్ద రుణగ్రహీతలకే కాదు ‘ప్లే ఫెయిర్ బిజినెస్’కూ మద్దతు ఇవ్వాలని ఆయన చెప్పారు. దేశంలో ఉద్యోగాలు, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లేది స్వతంత్ర వ్యాపార వాతావరణమే అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ వ్యాఖ్యానించారు.

