Home Page SliderNational

ఢిల్లీ సర్కారు అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రం కొత్త ఆర్డినెన్స్

ఢిల్లీ పోస్టింగ్స్‌పై కేంద్రం పెద్ద ఎత్తుగడ
లెఫ్టినెంట్ గవర్నర్‌ను కీలక చేస్తూ ఆర్డినెన్స్
మోడీ సర్కారుపై విరుచుకుపడ్డ ఆప్
సుప్రీం తీర్పు గౌరవించడం లేదంటూ ఆగ్రహం

బ్యూరోక్రాట్‌ల బదిలీలు, నియామకాలపై ఢిల్లీ ప్రభుత్వం నియంత్రణ కలిగి ఉండాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన కొన్ని రోజుల తర్వాత, కేంద్రం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. బదిలీల విషయంలో కేంద్రం ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. పోస్టింగ్‌లు, బదిలీలపై నిర్ణయం తీసుకునేందుకు ఆర్డినెన్స్ ద్వారా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని కేంద్రం రూపొందించింది. అథారిటీకి చైర్‌పర్సన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరించనుండగా, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. అథారిటీ నిర్ణయించాల్సిన అన్ని విషయాలు హాజరైన, ఓటింగ్ చేసే సభ్యుల మెజారిటీ ఓట్ల ద్వారా నిర్ణయించబడతాయి. అభిప్రాయ భేదాలు వస్తే లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయమే అంతిమని కేంద్రం పేర్కొంది. పార్లమెంటు ఉభయ సభల్లో ఆర్డినెన్స్‌ను ఆమోదించాల్సి ఉంటుంది. రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం తక్కువగా ఉంది. ఇప్పటికే కేంద్రంపై విరుచుకుపడుతున్న విపక్షాలు, బిల్లు విషయంలో ఎలా వ్యవహరిస్తాయో చూడాల్సి ఉంది.

ఈరోజు తెల్లవారుజామున, సర్వీసెస్ సెక్రటరీ ఆశిష్ మోర్ బదిలీకి సంబంధించిన ఫైల్‌ను క్లియర్ చేయడంలో జాప్యంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికైన ప్రభుత్వానికి కార్యనిర్వాహక అధికారాలను ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పును, ఆర్డినెన్స్ ద్వారా… తిప్పికొట్టడానికి కేంద్రం “కుట్ర” చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఆర్డినెన్స్‌ సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా విస్మరించిందని అధికార-ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ నిర్ణయానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆ పార్టీ మండిపడింది. ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం ఎన్నికైన ప్రభుత్వానికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాలను ఇవ్వాలని కోర్టు ఆదేశించినా, కేంద్రం, పెడచెవిన పెడుతోందని… ఢిల్లీ మంత్రి అతిషి విమర్శించారు. “కేంద్రం ఆర్డినెన్స్ మోదీ ప్రభుత్వం ఓటమికి ప్రతిబింబం. ఈ ఆర్డినెన్స్ తీసుకురావడంలో కేంద్రం ఏకైక ఉద్దేశ్యం కేజ్రీవాల్ ప్రభుత్వం నుండి అధికారాలను లాక్కోవడమే” అని ఆమె అన్నారు.

ఢిల్లీ ప్రజలను కేంద్రం మోసం చేసిందని ఆప్‌ ముఖ్య అధికార ప్రతినిధి, మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ అన్నారు. కొత్త ఆర్డినెన్స్‌ను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ అన్నారు. “ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం తన అధికారులను నియంత్రించడానికి, అనుమతించకపోతే, శాసనసభ, ప్రజల పట్ల దాని బాధ్యత పలచన అవుతుంది. ఒక అధికారి ప్రభుత్వానికి ప్రతిస్పందించకపోతే, సమిష్టి బాధ్యత పలుచన అవుతుంది. ఎన్నుకోబడిన ప్రభుత్వం నుండి అధికారులను వేరు చేస్తే… జవాబుదారీతనం ఎలా వస్తుంది ”అని సుప్రీంకోర్టు గత వారం పేర్కొంది.