Home Page SliderNational

ఒలింపిక్ మెడల్ విన్నింగ్ కోచ్‌ కబ్జాదారంటూ కేంద్ర గృహ నిర్మాణ శాఖ నోటీసులు

ఈ అధికారులకు తెలిసి చేస్తారో.. తెలియకుండా చేస్తారో.. రూల్స్ ప్రకారం చేస్తారో.. ఏంటో మరి.. దేశం గర్వించే క్రీడాకారులకు కోచ్ గా ఉన్న వ్యక్తి, అది కూడా ఒలిపింక్స్ జరుగుతున్న సమయంలో, ఆటగాళ్లను వదిలేసి, ఇండియాకు వచ్చేలా చేసింది కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ. అది కూడా ఆయన కుటుంబ సభ్యులు 75 ఏళ్లుగా ఉంటున్న నివాసం ఖాళీ చేయాలని, ఆయన కబ్జాకోర్ అంటూ ఇంటికి నోటీసులు అతికించింది. జాతీయ పిస్టల్ షూటింగ్ కోచ్ సమరేష్ జంగ్, ఢిల్లీలో 75 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని రెండు రోజుల్లో కూల్చివేయడానికి అధికారులు షెడ్యూల్ చేశారు. దీంతో ఆయన ఆఘమేఘాల మీద ప్యారిస్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చేశారు. సివిల్ లైన్స్ ప్రాంతంలోని ఖైబర్ పాస్ కాలనీ ఉన్న భూమి రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినదని, అందువల్ల అది చట్టవిరుద్ధమని పేర్కొంటూ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (LNDO) నోటీసు జారీ చేసింది.

“నేను నిన్న సాయంత్రం 5 గంటలకు తిరిగి వచ్చాను. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో, ఇల్లు రెండు రోజుల్లో కూల్చివేయబడుతుందని, మేము దానిని ఖాళీ చేయవలసి ఉందని ప్రకటన వచ్చింది,” అని జంగ్ చెప్పారు. తాను అద్దె, పన్నులు చెల్లిస్తున్నానని… కబ్జాదారుడని ఎలా అంటున్నారో అర్థం కావడం లేదన్నారు. “వారు నోటీస్ అతికించారు. ప్రాథమికంగా ఆక్రమణదారుల కోసమన్నట్టుగా రాశారు. నా కుటుంబం గత 75 సంవత్సరాలుగా ఇక్కడే ఉంది. నేను అద్దె చెల్లిస్తున్నాను, నేను పన్నులు చెల్లిస్తున్నాను. కాబట్టి, మేం ఎలా ఆక్రమణలకు గురయ్యామో అర్థం కావడం లేదు’’ అని అన్నారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. “నేను చట్టానికి అతీతుడను కాదు, చట్టం కోరితే నేను ఖాళీ చేస్తాను. కానీ రెండు రోజుల నోటీసు మార్గం కాదు. మాకు బయటకు వెళ్లడానికి కనీసం రెండు నెలల సమయం ఇవ్వండి” అని చెప్పాడు.

సమరేష్ జంగ్ కోచ్‌గా ఉండగా, 2006, 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో ఏడు స్వర్ణాలు, ఐదు రజతాలు, రెండు కాంస్య పతకాలను సాధించడంతో ఆయనకు ‘గోల్డ్ ఫింగర్’ అని పేరుగాంచారు. ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ గేమ్స్‌లో పిస్టల్ షూటర్లు భారత్ సాధించిన మూడు పతకాలలో రెండు పతకాలను అందించారు, మను భాకర్ వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కాంస్య పతకాన్ని సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ మూడో స్థానాన్ని పొందారు.