Home Page SliderNational

సుప్రీం కోర్టులో ముస్లిం మహిళల పరిస్థితిపై కేంద్రం సంచలన అఫిడవిట్

‘ట్రిపుల్ తలాక్’ ఆచారం “వివాహం వ్యవస్థకు ప్రాణాంతకమని , ముస్లిం మహిళల పరిస్థితి దయనీయంగా మార్చేస్తుందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో వాదించింది. 2017లో కొన్ని ముస్లిం వర్గాలలో చెల్లుబాటయ్యే ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల ముస్లిం మహిళలకు ఒరిగిందేమీ లేదని, విడాకులు తీసుకోవడంలో ఇది ఎంత మాత్రం ఉపకరించలేదని ప్రభుత్వం పేర్కొంది. ‘ట్రిపుల్ తలాక్’ బాధితులు పోలీసులను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేకుండాపోయిందని, చట్టంలో శిక్షించేలా నిబంధనలు లేకపోవడంతో భర్తలపై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోలీసులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పింది. ఇలాంటి పరిస్థితిలో మార్పు తేవాలంటే చట్టపరంగా కఠినమైన నిబంధనలు తేవాలని ప్రభుత్వం పేర్కొంది.

‘ట్రిపుల్ తలాక్’ పద్ధతిని సుప్రీంకోర్టు రద్దు చేసినందున దానిని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని వాదిస్తూ దాఖలైన పిటిషన్‌పై ప్రభుత్వం అఫిడవిట్‌ను సమర్పించింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం, 2019 రాజ్యాంగ విరుద్ధమని ఈ నెల ప్రారంభంలో సమస్తా కేరళ జమియతుల్ ఉలేమా అఫిడవిట్‌ దాఖలు చేసింది. తాము సున్నీ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని, తమకు ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆ సంస్థ పేర్కొంది. చట్టం ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని, చట్టం ముందు భారత పౌరులందరూ సమానమని రాజ్యాంగం హామీ ఇస్తోందని, మతం ఆధారంగా వివక్షను నిషేధించిందని పిటిషనర్లు వాదించారు. ఈ వాదనను కేంద్రం గట్టిగా తిప్పికొట్టింది. ‘ట్రిపుల్ తలాక్’ ఆచారం రాజ్యాంగం మహిళలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులు హామీని, సమానత్వ హక్కులను ఉల్లంఘిస్తుందని వాదించింది.

“ట్రిపుల్ తలాక్’ ద్వారా విడాకులు పొందిన వివాహిత ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించడానికి పార్లమెంటు తన విజ్ఞతతో చట్టాన్ని రూపొందించిందని, వివాహిత ముస్లిం మహిళలు సమానత్వం కోసం చట్టం సహాయపడుతుందని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. పార్లమెంటు ఆమోదించిన చట్టాల విజ్ఞతలోకి వెళ్లలేమని లేదా చట్టం ఎలా ఉండాలనే దానిపై చర్చలు జరపడానికి వీల్లేదని గతంలో సుప్రీంకోర్టు స్వయంగా పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తి చేసింది. “భూమిలోని ప్రజలకు ఏది మంచిది, ఏది మంచిది కాదు మరియు సరైనది కాదని నిర్ణయించడం శాసనసభ పని మాత్రమే, వారి అధికారాల పరిమితిలో వారి విధులను నిర్వహించడానికి వారికి విస్తృత అవకాశం ఇవ్వాలి, లేకపోతే అది పురోగతి నిరోధిస్తుందని ప్రభుత్వం వాదించింది. “ఒక నిర్దిష్ట ప్రవర్తనను నేరంగా పరిగణించాలా వద్దా, అలాంటి ప్రవర్తనకు ఎలాంటి శిక్ష విధించాలో ప్రస్తుత సామాజిక పరిస్థితుల దృష్ట్యా శాసనసభ నిర్ణయిస్తుంది…” అని అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది.