ఏపీలో మూడు రాజధానులకు కేంద్రం నో..?
జగన్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల ప్రణాళికకు కేంద్రంలోని బీజేపీ సర్కారు గండి కొట్టినట్లు తెలుస్తోంది. ఏపీలో మూడు రాజధానుల బిల్లును ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదిస్తామని సీఎం కేసీఆర్ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒకే రాజధాని వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన సమస్యలపై ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులను ఆహ్వానించింది.

ఈ సమావేశం కోసం రూపొందించిన అజెండాలో విభజన చట్టం షెడ్యూల్ 910లోని ఆస్తుల పంపకం, రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక అంశాలపై చర్చిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఈ అజెండాలో మూడు రాజధానుల ప్రస్తావనే లేదు. కొత్త రాజధానికి నిధులు, విద్యాసంస్థల ఏర్పాటు, రాజధాని నుంచి ర్యాపిడ్ రైలు వంటి అంశాలను చేర్చింది. దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఏకైక రాజధానికే మద్దతిస్తోందని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన సీఎం జగన్ మూడు రాజధానులకు సహకరించాలని కేంద్రం పెద్దలను కోరినట్లు సమాచారం ఉంది. అయినా.. కేంద్రం ఒకే రాజధానికి కట్టుబడి ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.