Home Page SliderNational

అదానీ లొసుగులపై విచారణకు కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం

అదానీ ఆస్తులు కరిగిపోవడం, ప్రజల పెట్టుబడులకు రక్షణ వ్యవహారానికి సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో అదానీ వ్యవహారంపై నియంత్రణ సంస్థలు పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తున్నాయని… మొత్తం వ్యవహారంపై విచారణ కమిటీ వేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు సొలిసిటర్ జనరల్ నివేదించారు. పెట్టుబడిదారులను రక్షించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించింది. మార్కెట్ అస్థిరత నుండి భారతీయ పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. అదానీ కంపెనీలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక సాక్షిగా ఇన్వెస్టర్లకు భారీ నష్టాన్ని నివారించడంలో నియంత్రణ సంస్థలతో ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వ ఆలోచనను వివరించారు. ప్రస్తుతం ఉన్న నియంత్రణ సంస్థలకు ఇబ్బంది కలక్కుండా… కమిటీని ఏర్పాటు చేసేందుకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. సెబీ, ఇతర ఏజెన్సీలు పాలనాపరంగానే కాకుండా… పరిస్థితిని జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నాయన్నారు. బుధవారం నాటికి ప్రతిపాదిత నిబంధనలపై నోట్‌ను సమర్పించాలని కోర్టు కేంద్రాన్ని కోరింది. గౌతమ్ అదానీ కంపెనీలకు $100 బిలియన్లకు పైగా నష్టాన్ని కలిగించి, US షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించిన కుట్రపై విచారణకు ఆదేశించాలని కోరుతూ న్యాయవాదులు విశాల్ తివారీ, మనోహర్ లాల్ శర్మ దాఖలు చేసిన PILలను కోర్టు విచారించింది. మార్కెట్‌లో పెట్టుబడిదారుల సంపదను కోల్పోవడం, భవిష్యత్తుకు సంబంధించిన సూచనలపై ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.