అగ్నిప్రమాదంలో చిక్కిన కోట్ల రూపాయల నగదు
హైదరాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లో నివసించే భైరి శ్రీనివాస్ అభిజిత్ అనే వ్యక్తి ఇంట్లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. అయితే అతని ఇంట్లో కట్టలు కట్టలు నగదు ఉందనే సమాచారం కూడా లభించింది. ఈ భైరి శ్రీనివాస్ అభిజిత్ ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉత్పత్తి చేసే కంపెనీలో డీజీఎంగా పని చేస్తున్నారు. అగ్నిప్రమాదం సమయంలో అతని ఇంట్లో ఎవరూ లేరు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం జరిగిందనే సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసారు. కొంత సామాగ్రి, చెక్క సామాగ్రి మంటల్లో కాలిపోయాయి.

అనంతరం కొంతసేపటికే పోలీసులకు కోట్లరూపాయలు ఆఇంట్లో ఉన్నాయనే సమాచారం అందింది. దీనితో ఆ ఇంటిని సోదా చేయగా, దాదాపు 1.65 కోట్ల రూపాయల నగదు, భారీగా బంగారు, వెండి వస్తువులు లభించాయి. ఆ డబ్బంతా ఒకేచోట కాకుండా బ్యాగుల్లో, అల్మారాలలో ఉండడంతో పోలీసులకు అతడు హవాలా వ్యాపారం చేస్తున్నాడనే అనుమానం వచ్చింది. అతనికి ఫోన్ చేయగా, తనవద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, హైదరాబాద్‌కు వచ్చాక చూపిస్తానని సమాధానం ఇచ్చాడు. దీనితో పోలీసులు ఆ డబ్బును ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు అందజేస్తామని, పత్రాలు సక్రమంగా ఉంటే స్వాధీనం చేస్తామని పేర్కొన్నారు. శ్రీనివాస్‌కు ఆ ప్రదేశంలోనే రెండుఇళ్లు ఉన్నట్లు తెలిసింది. వాటి విలువ 3 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనాలు వేశారు. విశాఖలో కూడా కొద్దిరోజుల క్రితమే ఇళ్లు నిర్మించినట్లు తెలిసింది. దీనితో తక్కువ సమయంలోనే అంత ఎలా సంపాదించారని, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.