బ్లాక్‌మనీకి కేరాఫ్ తెలంగాణ భూములు
బ్లాక్‌మనీని దాచుకోవడానికి స్విస్ బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు. దుబాయ్ పర్యటనలు, పనామా దీవులు, మారిషస్ మార్గం, బినామా వ్యక్తులు.. ఇలా తంటాలు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. తెలంగాణలో భూములు కొంటే సరి. కోట్లాది రూపాయల విలువైన భూములను లక్షల రూపాయలకే కొన్నట్లు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే బ్లాక్‌మనీ అంతా తెలంగాణ భూముల్లో నిక్షిప్తమవుతుంది. ఈ రహస్యం ఎవరు చెప్పారో తెలుసా.. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి చేవెళ్లలో భూముల ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. చేవెళ్లలో ఒక ఎకరా భూమి విలువ రూ.3 కోట్ల వరకు పలుకుతోంది. దాని రిజిస్ట్రేషన్ విలువ మాత్రం రూ.7 లక్షలే. అంటే.. ఒక ఎకరా భూమి కొంటే రూ.7 లక్షల వైట్‌మనీ.. రూ.2.93 కోట్ల బ్లాక్‌మనీ చెల్లించాలన్నమాట.

ఇంత భారీ వ్యత్యాసం ఏ రాష్ట్రంలోనూ లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. దీన్నిబట్టి నల్లధనాన్ని దాచుకోవడానికి తెలంగాణ భూములే సరైన వేదిక అని పేర్కొన్నారు. కొండా ట్వీట్‌పై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరగడం వల్లే భూముల రేట్లు పెరిగాయని కొందరు వ్యాఖ్యానించారు. ఈ భూములపై సీబీఐ, ఈడీ దృష్టి పెట్టి బ్లాక్‌మనీని బయటికి తీయాలని మరికొందరు సూచించారు. మీరు ఎన్ని ఎకరాలు కొన్నారు.. ఎన్ని ఎకరాలు విక్రయించారు.. అని ఇంకొందరు ప్రశ్నించారు.