News

బీజేపీలోకి కెప్టెన్ అమరిందర్ సింగ్

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి పంజాబ్ ఎన్నికల సమయంలో సొంత కుంపటి పెట్టుకున్న మాజీ సీఎం అమరిందర్ సింగ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చినా తనను కావాలని పార్టీ నుంచి వెళ్లగొట్టారన్న కారణంతో ఆయన హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. పంజాబ్‌లో పార్టీ పెట్టినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆయన కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటూ వచ్చారు. 80 ఏళ్ల అమరిందర్ సింగ్ ఇవాళ బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలిసారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. సుమారు 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ బాధ్యతలు చేపట్టిన కెప్టెన్ తాజాగా బీజేపీ గూటికి చేరారు. అమరీందర్ సింగ్‌తో పాటు ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ కూడా బీజేపీలో చేరారు. ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కెప్టెన్ అంతగా ప్రభావితం చేయలేకపోయారు. సొంత నియోజకవర్గం పాటియాలా అర్బన్‌లో ఓడిపోయారు. ఆయన పార్టీ తరపున నిలచిన అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.

వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత లండన్ నుండి తిరిగి వచ్చిన కెప్టెన్ గత వారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. సెప్టెంబరు 12న అమిత్ షాతో జరిగిన సమావేశంలో… జాతీయ భద్రతతోపాటు… పంజాబ్‌లో పెరుగుతున్న నార్కో టెర్రరిజం కేసులు, పంజాబ్ సమగ్ర అభివృద్ధికి భవిష్యత్ రోడ్‌మ్యాప్ అంశాలపై చర్చించినట్టు అమరిందర్ సింగ్ వివరించారు. రెండుసార్లు ముఖ్యమంత్రి పనిచేసిన కెప్టెన్ పాటియాలా రాజకుటుంబానికి చెందినవారు. గత ఏడాది సెప్టెంబర్‌లో, కాంగ్రెస్ ఆయన స్థానంలో చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఎంపిక చేయడంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడింది.