రాజధాని నియోజకవర్గాలను టార్గెట్ చేసిన జగన్
◆ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కి చెక్
◆ త్వరలో మంగళగిరిలో వైసిపి తీర్థం పుచ్చుకోనున్న గంజి చిరంజీవి
◆ రాజధాని నియోజకవర్గాల గెలుపు దిశగా జగన్ అడుగులు
◆ తాడికొండ అదనపు వైసీపీ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా నియామకం
◆ భగ్గుమన్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, సుచరిత ఇంటి ముందు బైఠాయింపు
ఏపీలో అన్ని నియోజకవర్గాల గెలుపే ధ్యేయంగా వ్యూహాలు అమలు చేస్తున్న వైఎస్ జగన్ రాజధాని నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టి సారించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఏపీ రాజధాని అమరావతిగా ఉండగా ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమని వైఎస్ జగన్ భావించి మూడు రాజధానులు బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ అమరావతి రాజధానిని మార్చవద్దు అంటూ అప్పటి నుండి రాజధాని గ్రామాల రైతులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజధాని ముఖ్య నియోజకవర్గాలైన తాడికొండ ,మంగళగిరిలలో ఈసారి జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్సీపి అభ్యర్థులు ఓటమిపాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్రహించిన జగన్, ఆయా నియోజక వర్గాల్లో దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి కి చెక్ పెట్టే దిశగా వైసీపీ అధిష్టానం ఆ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించింది.

అసలే అమరావతి రాజధాని తరలింపు నేపథ్యంలో తాడికొండ నియోజకవర్గం లో వైసీపీ పై కొంతమేర వ్యతిరేకత ఉండటం, దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి వైసిపి క్యాడర్ ను కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో గత కొంతకాలంగా ఆ నియోజకవర్గంలోని ఒక వర్గం ఆమెపై గుర్రుగా ఉండటం, గతంలో ఒక సీఐని బెదిరించటం అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, లాంటి ఎన్నో తప్పులు చేయటంతో ఆ నియోజకవర్గంలో పూర్తిగా వైసిపి బలహీన పడిందని గుర్తించిన జగన్ ముందుగా దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ నియోజకవర్గానికి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ను అదనపు సమన్వయకర్తగా నియమించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో డొక్కా తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తాడికొండ నియోజకవర్గంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన వర్గం ఇప్పటికీ ఉంది. అక్కడ ఆయనుకున్న పరిచయాలు, రాజకీయ చతురత, అనుభవం ద్వారా తాడికొండలో వైసిపి గెలుపే ధ్యేయంగా జగన్ అడుగులు వేసినట్లు తెలుస్తుంది. అదనపు సమన్వయకర్తగా డొక్కాను నియమించడంతో ఉండవల్లి శ్రీదేవి భగ్గుమన్నారు. మాజీ హోం మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షురాలు మేకతోటి సుచరిత క్యాంప్ కార్యాలయం వద్ద తన అనుచరులతో ఎమ్మెల్యే నిరసన చేపట్టారు. దళిత ఎమ్మెల్యేను అవమానించి టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన డొక్కాను ఎలా సమన్వయకర్తగా నియమిస్తారని ప్రశ్నించారు. దీనిపై అధిష్టానంతో తాడోపడో తేల్చుకుంటానని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.