Andhra PradeshHome Page Slider

క్యాంపు రాజకీయాల్లో చంద్రబాబు దేశంలోనే నంబర్‌ వన్‌:సజ్జల

•ఎవ్వరు క్రాస్ ఓటు వేసారో కనిపెట్టాం
•సరైన టైమ్ లో సరైన నిర్ణయం తీసుకొంటాం
•ఏదో సాధించామని టీడీపీ అనుకుంటే 175 స్థానాల్లో పోటీ చేయాలి
• ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి

ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరగడంపై ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వాస్తవానికి వైసీపీ మొత్తం 7 సీట్లు గెలుపొందేందుకు అన్ని అవకాశాలు ఉండగా చంద్రబాబు క్యాంపు రాజకీయలు, ప్రలోభాలకు గురి చేసి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. ప్రలోభాలకు లోనైన వారు వారి భవిష్యత్‌ను గురించి ఆలోచించలేదని కౌంటింగ్‌ తర్వాత మీడియాతో సజ్జల పేర్కొన్నారు. క్యాంపు రాజకీయాలకు, ప్రలోభాలకు గురి చేయడంలో చంద్రబాబు దేశంలోనే నంబర్‌వన్‌ అని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి చెందిన ఇద్దరు ప్రలోభాలకు గురై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. క్రాస్‌ ఓటింగ్‌ పై వైసీపీ సీనియర్‌ నాయకులు లోతుగా విశ్లేషించి తగు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డవారిని గుర్తించామన్నారు. అయితే వారి పేర్లు ఇప్పుడు చెప్పమన్నారు. సరైన సమయంలో వారిపై చర్యలుంటాయని సజ్జల వ్యాఖ్యానించారు. గతంలోనూ అలాగే టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని, ఇప్పుడు కూడా అదే చేసిందన్నారు. టీడీపీ వాళ్లు ఎవరినో కొనుగోలు చేసినట్లు ఉన్నారని సజ్జల పేర్కొన్నారు. ఈ ఒక్క గెలుపు చూసుకుని తాము ఏదో సాధించామని టీడీపీ అనుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు.