‘అక్కడ ఉపఎన్నికలు జరుగుతాయి’..కేటీఆర్
హైకోర్టు తీర్పు తెలంగాణ కాంగ్రెస్‌కు చెంపదెబ్బలా తగిలిందని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, తమ పార్టీ నేతలను ఆకర్షించి కాంగ్రెస్‌లో చేర్చుకున్నందుకు మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన దానం, కడియం, తెల్లం వెంకట్రావుల ఎమ్మెల్యే పదవులు ఊడడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. వారి నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరపవల్సిందేనన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుపట్టారు. రాహుల్ గాంధీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ చేస్తున్నామని కల్లబొల్లి మాటలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. నాలుగు వారాల్లోగా ఎమ్మెల్యేల అనర్హతపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే కేసును సుమోటోగా తీసుకుంటామంది. పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు విచారణ జరిపింది.

