స్టీల్ ప్లాంట్ కాపాడలేని జగన్ మొనగాడా?
సీపీఎం సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు చాన్నాళ్ల తర్వాత, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసనలో పాల్గొన్నారు. అధికార, ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. బీజేపీకి రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ, జనసేన దాసోహమయ్యాయంటూ ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ కాపాడలేని జగన్ మొనగాడా అంటూ దెప్పిపొడిచారు . ఢిల్లీ వెళ్లి మీసం తిప్పుతున్నారని… గదిలోకి వెళ్లిన తర్వాత ఆ దీమా ఏమవుతుందని ప్రశ్నించారు.
పార్లమెంట్లో బీజేపీ పెట్టిన బిల్లలన్నింటికీ వైసీపీ జైకొడుతోందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను సమర్థిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మోదీకి జగన్ చెంచాగిరీ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. స్టీల్ ప్లాంట్ కాపాడలేనివాడు మొనగాడా అంటూ, జగన్‌ను ప్రశ్నించారు. పిరికితనంతో బీజేపీ పంచన చేరారన్నారు. జైలుకు భయపడతావా అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని పాతిపెట్టిన పార్టీలు అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీలు కలిసి పోరాడితేనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందన్న రాఘవులు ఉమ్మడి ఉద్యమంతోనే కార్మికులకు మేలు జరుగుతుందన్నారు.