స్కూటీపై ఎద్దు రైడింగ్..
ఉత్తరాఖండ్ లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రిషికేశ్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన పార్క్ చేసిన స్కూటర్ ఎక్కిన ఎద్దు అనూహ్యంగా దానిని రైడ్ చేస్తూ ముందుకు దూసుకెళ్లింది. అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రిషికేశ్ లోని ఓ రహదారి దాదాపు జనసంచారం లేకుండా ప్రశాంతంగా ఉంది. ఆ సమయంలో ఓ ఎద్దు ఆ మార్గంలో సంచరిస్తూ కనిపించింది. కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఓ స్కూటీ వద్దకు చేరింది. ఎవరూ ఊహించని విధంగా, అది ఒక్కసారిగా స్కూటర్ మీదకు ఎక్కి సీటుపై కూర్చుంది. అంతటితో ఆగకుండా తన కాళ్లతో స్కూటీను నెమ్మదిగా ముందుకు కదిలించింది. సాధారణంగా జంతువులు, ముఖ్యంగా పశువులు ఇలా వాహనాలపైకి ఎక్కడం లేదా వాటితో విన్యాసాలు చేయడం ఉండదు. కానీ ఈ ఎద్దు ప్రవర్తన అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై జరిగిన ఈ విచిత్ర సంఘటన తాలూకు దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


 
							 
							