Andhra PradeshNewsNews Alert

విశాఖలో.. నడిరోడ్డుపై రౌడీషీటర్ దారుణ హత్య

కలి చేసే వింతలు, విడ్డూరాలు అన్నీ ఇన్నీ కావు. స్నేహాన్ని చీలుస్తుంది. తల్లీ కొడుకుల మధ్య చిచ్చు పెడుతుంది. ఊహకు అందని, ఊహించని ఎన్నో భయంకర క్రూరాలను ప్రేరేపిస్తుంది. రౌడీయిజానికి పురి కొల్పుతుంది. కలి ప్రభావం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కాలం చేసే గాయాలను ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడూ అదే జరిగింది. స్నేహం ముసుగులో అకృత్యాలు, అఘాయిత్యాలు పెరిగి పోతున్నాయి. ఇలాంటి అమానవీయ ఘటన తాజాగా విశాఖపట్టణంలో చోటు చేసుకుంది. ఇద్దరి స్నేహితుల మధ్య చెలరేగిన వివాదం చివరికి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇద్దరు యువకులు కలిసి ఒక వ్యక్తిని విచక్షణా రహితంగా కత్తితో పొడిచి, పీక కోసి అతిపాశవికంగా హత్య చేసిన ఘటన ఎంవీపీ కాలనీలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో.. అక్కడి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో వారు ఆ ఘటన నుంచి తేరుకోక ముందే నిందితులు పరారయ్యారు.

వారంతా స్నేహితులయినప్పటికీ అంతర్గతంగా పెంచుకున్న ద్వేషం చివరకు రౌడీషీటర్ దారుణ హత్యకు కారణమయ్యిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోలీసుల ఇచ్చిన సమాచారం మేరకు నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ అప్పుఘర్‌కు చెందిన అనిల్ కుమార్, ఎంవీపీ కాలనీ ఆదర్శనగర్‌లో నివాసముంటున్న శ్యామ్‌ప్రకాశ్ ఎప్పటి నుంచో స్నేహితులు. ఈ ఘటనలో దారుణ హత్యకు గురైన అనిల్ కుమార్ ఒక రౌడీ షీటర్‌. కార్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. శ్యామ్‌ప్రకాశ్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను కూడా రౌడీ షీటరే. వీరిద్దరిపై అనేక కేసులు ఉన్నాయి. హత్యకు గురైన అనిల్ కుమార్‌ ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. కాకినాడ టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో రౌడీ షీట్ కూడా ఉంది. తనను హేళనగా చూడడంతో పాటు అవహేళన చేస్తున్నాడని శ్యామ్‌ప్రకాశ్ భావించేవాడు. దీంతో అనిల్ పై కోపాన్ని పెంచుకున్నాడు. గతంలో కూడా ఒకసారి క్రికెట్ ఆడుతూ ..ఇద్దరూ గొడవ పడ్డారు.

అయినప్పటికీ చుట్టుప్రక్కల వారు సర్దిచెప్పటంతో రాజీపడి మళ్ళీ స్నేహితులయ్యారు. కానీ మళ్ళీ వాగ్వాదం జరిగింది. అది కాస్తా తోపులాటకు దారి తీయడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అనంతరం శ్యామ్‌ప్రకాశ్ ,మరోకరు కలిసి అనిల్‌పై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన అనిల్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ప్రధాన నిందితుడు శ్యామ్‌ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.