‘గత ఏపీ ప్రభుత్వ జలదోపిడీకి బీఆర్‌ఎస్ సహకారం’..మంత్రి సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు నీళ్లు రాలేదు కానీ బీఆర్‌ఎస్ నేతల జేబులు నిండాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సచివాలయంలోని మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మాజీ ఏపీ సీఎం జగన్‌తో స్నేహంగా ఉంటూ, ఏపీ జలదోపిడీకి సహకరించారని బీఆర్‌ఎస్ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నా, ముచ్చుమర్రి ప్రాజెక్టు నిర్మిస్తున్నా అప్పటి సీఎం కేసీఆర్ నోరెత్తలేదని విమర్శించారు. కృష్ణా నదీ జలాలలో తెలంగాణకు కేవలం 200 టీఎంసీలు సరిపోతాయని బీఆర్‌ఎస్ చెప్పిందన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే, 500 టీఎంసీల నీరు కావాలనే డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. రూ.లక్ష కోట్ల పైన ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కూలిపోయిందని, ఈ అప్పు తెలంగాణ ప్రజలు ఎన్నటికీ తీర్చలేనంత భారంగా మారిందని విమర్శించారు.

