కారు గుర్తుపై బీఆర్‌ఎస్ పార్టీకి సుప్రీంలో చుక్కెదురు..
కారు గుర్తును, కారును పోలిన వాహనాల గుర్తులను వేరే పార్టీలకు కేటాయించవద్దంటూ బీఆర్‌ఎస్ వేసిన పిటిషన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. ఫ్రీసింబల్స్ జాబితాలో కారును పోలిన గుర్తులు కేటాయించవద్దని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు పార్టీ గుర్తు విషయంలో షాక్ తగిలింది. గత ఎన్నికలలో కారును పోలిన గుర్తులు కొన్ని ఇండిపెండెంట్ పార్టీలకు కేటాయించారని, దీనితో తమకు రావలసిన ఓట్లు చీలిపోయాయని బీఆర్‌ఎస్ పార్టీ అభిప్రాయపడింది. దీనితో ఈసారి ఎన్నికలలో అయినా ట్రాక్టర్, కారు, జీపు ఇన్నోవా, సుమోల లాంటి గుర్తులను ఇతర పార్టీలకు గానీ, ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు గానీ కేటాయించకుండా ఎన్నికల కమీషన్‌కు ఆదేశాలు జారీ చేయమని, సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. నేడు ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు అనుమతిలోకి తీసుకోకుండా తోసిపుచ్చింది. కారుకు, రోటీ మేకర్‌కు తేడా తెలియనంత అమాయకులు కాదు ఓటర్లు అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. బీఆర్‌ఎస్ అభ్యర్థనను పరిగణించకుండా పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఎన్నికల గుర్తుల విషయంలో పూర్తి అధికారం ఎన్నికల కమీషన్‌దేనని వ్యాఖ్యానించింది.