ఏపీలోకి అడుగుపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధం
◆ కీలక విభాగాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
◆ ఈ నెలాఖరుకు ముహూర్తం ఖరారు?
◆ అట్టహాసంగా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఏపీలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అడుగు పెట్టేందుకు వ్యూహారచన చేస్తున్న బీఆర్ఎస్ ఏపీ పైన దృష్టి సారించింది. కాలయాపన లేకుండా ఈ నెలాఖరులోనే ఆంధ్రప్రదేశ్ లో తొలి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. ముందుగా ఒక విభాగాన్ని ప్రారంభించడం ద్వారా ఏపీలో బీఆర్ఎస్ అడుగు పెట్టబోతుందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈనెలాఖరులోనే ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారని సమాచారం. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడంతో దానికే ప్రాధాన్యంగా తీసుకొని కెసిఆర్ ఇక్కడ అడుగు పెట్టేందుకు వ్యూహారచన చేస్తున్నారని అదే కార్యక్రమంతో అట్టహాసంగా ఏపీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెబుతున్నారు.

ఇప్పటికే విజయవాడలో బీఆర్ఎస్ ఏపీ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసేందుకు స్థలంతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కిసాన్ సెల్ ఏర్పాటు చేసి తన తొలి కార్యక్రమానికి విజయవాడ కేంద్రంగా కేసీఆర్ అడుగు వేయబోతున్నారు. ఏపీ సహా ఆరు రాష్ట్రాల్లో ఇదే తరహాలో కిసాన్ సెల్ ల ఏర్పాటు చేయడం ద్వారా రైతుల నుండి మద్దతు కూడగట్టే ప్రయత్నం ఆయన చేయబోతున్నారు. రైతు పార్టీగా రైతు అజెండాతో ముందుకెళ్లాలని భావిస్తున్న టిఆర్ఎస్ కు కిసాన్ సెల్ చాలా ముఖ్యమైనది. దీంతో ముందుగా కిసాన్ సెల్ ఏర్పాటుతో పార్టీని లాంఛనంగా ఏపీలో ప్రారంభించేందుకు కెసిఆర్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి ఎవరి నేతృత్వం వహించాలి, విజయవాడ కేంద్రంగా పనిచేసే కేంద్ర కార్యాలయంలోని దీన్ని ఏర్పాటు చేయాలా, అన్నదానిపై ఇప్పుడు ఆ పార్టీలోని సీనియర్ నాయకులతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఆఖరిలోనే ప్రారంభించడానికి కార్యాచరణ సిద్ధమైందని, బీఆర్ఎస్ కీలకంగా వ్యవహరించనున్న ఆరు రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో కిసాన్ సెల్ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయని సమాచారం.

