బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన చేపట్టారు. అప్పులు ఘనం.. అభివృద్ధి శూన్యం అంటూ ప్లకార్డులతో హోరెత్తించారు. అప్పులు ఆకాశంలో.. అభివృద్ధి పాతాళంలో అంటూ నినాదాలు చేశారు. రూ. లక్షా 58 వేల కోట్ల అప్పు చేసి ఎంత మంది మహిళలకు రూ. 2,500 ఇచ్చారని మండిపడ్డారు. ఎంత మంది వృద్ధులకు రూ. 4,000 పెన్షన్ ఇచ్చారు. ఎంత మంది ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారు. ఎంత మందికి తులం బంగారం ఇచ్చారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. అనంతరం మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం ఖండిస్తున్నామన్నారు. సభలో ప్రజల సమస్యలు చర్చించడం లేదని, కేవలం బిల్లులు ప్రవేశపెట్టడం పాస్ చేయించుకోవడమే జరుగుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ పై ప్రభుత్వం చేసిన అప్పులను ఎండగడుతామన్నారు.

