వివాదంలో చిక్కుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తెలంగాణా ప్రభుత్వ విప్,బీఆర్ఎస్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్ వివాదంలో చిక్కుకున్నారు. కాగా ఈ రోజు బిక్నూర్ మండలంలో ఆయన పర్యటించారు. తన పర్యటనలో భాగంగా పెద్దమల్లారెడ్డిలో ఆయన రైతులతో మాట్లాడారు. కాగా రైతులు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని తెలిపారు. దీంతో మిల్లర్లు ఈ ధాన్యాన్ని కొనేందుకు ముందుకు రావడం లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. రైతుల బాధను విన్న ఎమ్మెల్యే పెద్దమల్లారెడ్డిలో ఉన్న రైస్ మిల్లు వద్దకు వెళ్లి ధాన్యం ఎందుకు కొనడం లేదో వివరణ ఇవ్వాలని కోరారు. అయితే రైస్ మిల్ సిబ్బంది ఎమ్మెల్యేకు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే రైస్ మిల్ సిబ్బంది చెంప చెల్లుమనిపించారు. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తనకు నిరసనగా మిల్లులో లోడింగ్‌ను నిలిపివేసిన మిల్లర్లు ఆందోళన బాట పట్టారు. కాగా ఎమ్మేల్యే తమకు తక్షణమే క్షమాపణ చెప్పాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.