మంత్రి సీతక్కపై బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ విమర్శలు
సైదాబాద్ జువైనైల్ హోంలో జరిగిన లైంగిక దాడి ఘటనపై బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జువైనైల్ హోంలో ప్రిన్సిపాల్ పది మంది చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో మంత్రి సీతక్కపై దూసుకెళ్లిన ప్రవీణ్ కుమార్, “తమ శాఖ పరిధిలో ఇంత పెద్ద ఘటన జరిగినా మంత్రి సీతక్క అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించలేదు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం బోరబండ, షేక్‌పేట్ ప్రాంతాల్లో తిరుగుతున్నారు,” అని విమర్శించారు.
“ఈ ప్రభుత్వానికి పిల్లల భద్రత కంటే ఓట్లు ముఖ్యమైపోయాయి. చిన్నారులకు అన్యాయం జరిగినా పట్టించుకోరే పరిస్థితి ఉంది,” అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కూడా ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

