Breaking Newshome page sliderHome Page SliderTelangana

జూబ్లీహిల్స్‌ నుంచే బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర ప్రారంభం

జూబ్లీహిల్స్‌ నుంచి బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ఆయన అన్నారు.

షేక్‌పేట్‌ డివిజన్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు తోట మహేష్ ముదిరాజ్‌ తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరగా, కేటీఆర్‌ వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్‌ కాంగ్రెస్‌ హామీలు వాస్తవం కాలేదని, పేదల ఆశలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు.

“కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తగ్గాయి. ఉచిత మంచినీళ్లు, బస్తీ దవాఖానాలు, రూ.5 భోజనం, పింఛన్లు, రంజాన్‌ తోఫా వంటి అనేక పథకాలు అమలయ్యాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను బకాయిలతో ముంచేసింది,” అని విమర్శించారు.

జూబ్లీహిల్స్‌ ప్రజలు మోసపోవద్దని, మోసాన్ని మోసంతోనే జయించాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. “వచ్చే నెల 11న జరిగే పోలింగ్‌లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి. కేసీఆర్‌ పాలనలో సాధించిన అభివృద్ధిని కాపాడుకుందాం” అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.