బీఆర్ఎస్ ఎప్పుడో బీజేపీలో కలిసింది..
బీఆర్ఎస్ ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు కోమటి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి మాట్లాడుతూ.. విదేశాల నుంచి నల్లధనం తెస్తామని, పేదల ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామన్న మోదీ.. చివరకు 15 పైసలు కూడా వేయలేదని దుయ్యబట్టారు. పేదలను పట్టించుకోని మోదీ.. అదానీని మాత్రం ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో చేర్చారని ఫైర్ అయ్యారు. అదానీ మెగా కుంభకోణంపై విచారణ జరపాలని మంత్రి డిమాండ్ చేశారు.

