కాంగ్రెస్ అరాచకాలపై ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు
హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తోంది. అన్ని వీడియో, ఫోటో ఆధారాలతో సమర్పించామన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. కొంతమంది పోలీస్ అధికారులు, ఇతర అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. సీ విజిల్ యాప్ లో కంప్లైంట్ కూడా ఇస్తున్నామన్నారు. పోలీసు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు తెలివైన వారు. తగిన రీతిలో కాంగ్రెసుకు బుద్ధి చెబుతారని అన్నారు. ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలుగా ఆరు గ్యారెంటీలపై రివ్యూ పెట్టడానికి టైం దొరకలేదు. ఈ రోజు 6 గ్యారంటీలపై రివ్యూ పెట్టడం ఎందుకు? మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. ఎన్నిసార్లు కేబినెట్ సమావేశం జరిగింది. అసెంబ్లీ జరిగింది. అయినా ఆరు గ్యారంటీలపై ఏనాడు రివ్యూ చేయలేదు. జూబ్లీహిల్స్ లో ఓటమి భయంతో ముఖ్యమంత్రి మోకాళ్లపై తిరుగుతున్నాడని అన్నారు. ఈరోజు ఆరు గ్యారెంటీలపై ముఖ్యమంత్రి రివ్యూ చేయడం జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయడమేనన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా జూబ్లీహిల్స్ ఓటర్లు ముందే నిర్ణయించుకున్నారని తెలిపారు.

