కర్నాటకలో పీక్‌కు బ్రదర్స్ వార్
మే 10న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు ఇద్దరు అన్నదమ్ములు హోరాహోరీ తలపడుతున్నారు. ఒకరు కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకరు బీజేపీ నుంచి ఢీ అంటే ఢీ అంటున్నారు. కర్ణాటక మాజీ సీఎం, దివంగత బంగారప్ప కుమారులు ఎన్నికల్లో గెలుపు కోసం హోరాహోరీ తలపడుతున్నారు. 1967 నుండి 1994 వరకు లోక్‌సభకు ఎన్నికయ్యే వరకు తండ్రి ప్రాతినిధ్యం వహించిన శివమొగ్గ జిల్లాలోని సొరబ నియోజకవర్గం కోసం
కుమార్ బంగారప్ప, మధు బంగారప్ప ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు.

బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుమార్, సొరబ నుంచి మళ్లీ ఎన్నిక కోసం ప్రయత్నిస్తుండగా, ఆయన తమ్ముడు మధు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కుమార్ 3,286 ఓట్ల తేడాతో మధుపై విజయం సాధించారు. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను విడిచిపెట్టి కుమార్, బీజేపీలో చేరి 2018లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత, మధు, జేడీఎస్‌కు గుడ్ బై చెప్పి, 2021లో కాంగ్రెస్‌లో చేరారు. సోదరులిద్దరూ ఒకరిపై ఒకరు పోటీ పడుతుండటంతో… కుటుంబ కలహాలను బజారుకు తీసుకొస్తున్నారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఇద్దరి మధ్య యుద్ధం భీకరంగా మారుతోంది.

బంగారప్ప బతుకున్నప్పుడే… 2004 నుంచే సోదరులిద్దరూ ప్రత్యర్థులుగా మారారు. 1996 (ఉపఎన్నికలు), 1999, 2004, 2018లో నాలుగు సార్లు సొరబ నుంచి ప్రాతినిధ్యం వహించిన కుమార్ మంత్రిగా కూడా పనిచేశారు. 2013లో ఒక్కసారి మాత్రమే మధు సొరబ నుంచి విజయం సాధించారు. సోదరులు కూడా గతంలో కన్నడ చిత్ర పరిశ్రమతో అనుబంధం కలిగి ఉన్నారు. కుమార్ నటుడిగా, మధు నటుడిగా, నిర్మాతగా గుర్తింపు పొందారు. కుమార్ మొదట్నుంచి కాంగ్రెస్‌లో ఉండగా, మధు బీజేపీ, జేడీఎస్, సమాజ్‌వాదీ పార్టీలతో కలిసి పనిచేశారు.