భగవద్గీతపై ప్రమాణం చేసిన బ్రిటన్ ఎంపీ
యూకే పార్లమెంట్లో భారతీయ మూలాలున్న ఎంపీ శివానీ రాజా ప్రమాణస్వీకారం చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. ఇటీవల బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అక్కడ పార్లమెంట్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారత సంతతి ఎంపీలు 27మంది ఎన్నికయ్యారు. వీరిలో లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుండి కనజర్వేటివ్ పార్టీకి చెందిన శివాని విజయం సాధించింది. 37 ఏళ్లుగా లేబర్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆస్థానాన్ని ఆమె దెబ్బకొట్టి గెలుచుకున్నారు. ఆమెకు ప్రత్యర్థి కూడా భారతీయ సంతతి నేత రాజేశ్ అగర్వాల్ కావడం విశేషం. గీతపై ప్రమాణం చేయడం గర్వంగా ఉంది అంటూ ఆమె వ్యాఖ్యానించారు. 29 ఏళ్ల వయస్సున్న ఈ యంగ్ ఎంపీ వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు. ఈ ఎన్నికలలో 650 పార్లమెంట్ స్థానాలకు గాను లేబర్ పార్టీ 412 స్థానాలు సాధించి గెలుపొందింది. కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 చోట్ల విజయం సాధించింది. దీనితో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన రిషి సునాక్ ప్రధానిగా అధికారాన్ని కోల్పోయారు. లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టార్మర్ బాధ్యతలు స్వీకరించారు.