InternationalNews

లిజ్ రాక… ప్రీతి రాజీనామా.. బ్రిటన్‌లో గందరగోళం

బ్రిటన్‌ హోం మంత్రి ప్రీతి పటేల్‌ రాజీనామా చేశారు. బ్రిటన్‌ కొత్త ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ ఎన్నికవడంతో భారత సంతతికి చెందిన 50 ఏళ్ల ప్రీతి హోం మంత్రిగా వైదొలిగారు. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రధాన అనుచరిణిగా గుర్తింపు పొందిన ప్రీతికి కొత్త ప్రధాని లిస్‌ ట్రస్‌తో సత్సంబంధాలు లేవు. అందుకే కొత్త ప్రభుత్వంలో తాను పనిచేయలేనని స్పష్టం చేస్తూ ప్రధానిగా వైదొలగనున్న బోరిస్‌ జాన్సన్‌కు లేఖ రాశారు. హోం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం గర్వంగా భావిస్తున్నట్లు, మూడేళ్ల తన పదవీ కాలం సంతృప్తికరంగా పూర్తయిందని లేఖలో పేర్కొన్నారు.

1991లో కన్జర్వేటివ్‌ పార్టీలో చేరిన ప్రీతి 2010లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2019 నుంచి యూకేకు హోం సెక్రటరీగా ఉన్నారు. బోరిస్‌ జాన్సన్‌ స్థానంలో ప్రధాని రేసులో ప్రీతి కూడా ఉన్నారు. అయితే.. ఆమె ప్రధాని రేసు నుంచి అనూహ్యంగా తప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా.. ప్రధాని రేసులో ఓడిపోయిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌కు లిజ్‌ ట్రస్‌ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు. అయితే.. రిషి సునాక్‌ మద్దతుదారులకు మాత్రం మంత్రివర్గంలో చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.