గల్ఫ్ ఆంధ్రులను సురక్షితంగా రప్పించండి
పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇజ్రాయెల్ , ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రుల భద్రతపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ నెలకొన్న అనిశ్చితి, భద్రత కొరవడిన పరిస్థితుల దృష్ట్యా భారతీయులను, ముఖ్యంగా వేలాది మంది ఆంధ్రులను తక్షణమే స్వదేశానికి సురక్షితంగా తీసుకురావాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సోమవారం విజ్ఞప్తి చేశారు. యుద్ధం కారణంగా పలు విమానాశ్రయాల్లో ఆంక్షలు, సర్వీసుల రద్దు వల్ల చాలామంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తు చేశారు.
ఈ సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉందని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రుల భద్రత , వారి సురక్షిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, అందుకే ఏపీ ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. గల్ఫ్ ప్రాంతంలోని ప్రధాన నగరాల్లో నెలకొన్న అస్థిరత వల్ల అక్కడి తెలుగు వారు ఆందోళన చెందుతున్నారని, ఈ తరుణంలో ప్రభుత్వం చొరవ చూపి వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గల్ఫ్‌లో చిక్కుకున్న వారి పరిస్థితిని ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేసేలా రాష్ట్రంలో తక్షణమే ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ సూచించారు. దీనితో పాటు బాధితులకు అవసరమైన సాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. యుద్ధం వల్ల అనిశ్చితి నెలకొన్న ప్రాంతాల్లోని మన వారిని సురక్షితంగా రప్పించడమే ఇప్పుడు ప్రాధాన్యత కావాలని ఆయన స్పష్టం చేశారు

