చంద్రబాబు దూకుడుకు బ్రేకులు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు మరో ఏడు నెలల సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలతో రాజకీయాలు వేడెక్కాయి. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పక్కా ప్రణాళికలతో ముందుకు సాగిన తెలుగుదేశం పార్టీకి ఊహించని విధంగా చంద్రబాబుకు స్కిల్ స్కాం బ్రేకులు వేసింది. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు రిమాండ్ కు వెళ్ళకముందు చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలు లోకేష్ పాదయాత్రలు చేస్తూ పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చారు. మినీ మేనిఫెస్టోను అందరికంటే ముందే ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ముందే మొదలుపెట్టారు. దీంతో దూకుడుగా ముందుకు వెళ్తున్న చంద్రబాబు స్పీడుకు స్కిల్స్ స్కామ్ ఆరోపణలు బ్రేకులు వేశాయి.

కేవలం ఆరోపణలు మాత్రమే కాకుండా సిఐడి రిమాండ్ కూడా విధించడంతో తెలుగుదేశం పార్టీ అధినేత జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా పర్యటనలు ఆగిపోయాయి. లోకేష్ పాదయాత్రకు కూడా బ్రేక్ పడింది. తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు వ్యూహాలన్నీ పటాపంచలు అయ్యాయి. వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాలకు చెక్ పెట్టడంలో జగన్ సక్సెస్ అయ్యారనే మాటలు వినపడుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజాక్షేత్రంలో ఉన్న అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ స్థానాన్ని పూర్తిగా భర్తీ చేసేందుకు ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది.

త్వరలోనే పల్లెకి పోదాం కార్యక్రమానికి జగన్ సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అలాగే నియోజకవర్గ పర్యటనలు కూడా చేసేందుకు జగన్ పక్కా ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందే తెలుగుదేశం పార్టీని కట్టడి చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాజా పరిస్థితులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మార్చుకొని తిరుగులేని విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. మరి జగన్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో, తెలుగుదేశం పార్టీ ఎలా పుంజుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.