శీతాకాల సమావేశాలు బాయ్‌కాట్..ఇండియా కూటమి అనూహ్య నిర్ణయం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను తాము బాయ్‌కాట్ చేస్తున్నట్లు ఇండియా కూటమి ఎంపీలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంతో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌లో భద్రతా ప్రమాణాలు క్షీణించాయని, విపక్షాలను నోరెత్తకుండా సస్పెండ్ చేస్తున్నారని వారు ఆందోళన చేస్తున్నారు. స్మోక్ బాంబు ఘటన తర్వాత ప్రభుత్వం ఈ విషయంపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. దీనితో స్పీకర్ ఇప్పటి వరకూ 142 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. వీరు సభామర్యాద పాటించలేదని స్పీకర్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను లేకుండా చేయాలని ఆలోచిస్తోందని, అందుకే విపక్షాలను సస్పెండ్ చేస్తున్నారని విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. దీనితో విపక్ష సభ్యులు గుమ్మం వద్ద బైఠాయించి నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలకు తాము హాజరు కాబోమని స్పష్టం చేశారు.

