గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభం అయ్యాయి. అయితే.. గ్రామ సభలో అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. పెద్దపల్లి నియోజకవర్గం బోంపల్లి గ్రామ సభలో అధికారులపై గ్రామస్తులు తిరగబడ్డారు. గుంట భూమి లేని వారి పేరు లిస్టులో లేదు కానీ ఎకరాల భూమి ఉన్న వారి పేర్లు లిస్టులో ఉన్నాయంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డుల కోసం ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో గ్రామస్తులను అధికారులు సముదాయించడంతో వెనక్కి తగ్గారు గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని గాదేపల్లి గ్రామంలో ఇవాళ ప్రజలు గ్రామ సభను బహిష్కరించారు. లబ్ధిదారుల లిస్టుపై గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదని, జాబితా తమకు ఆమోదయోగ్యంగా లేదని సభను బహిష్కరించి వెళ్లిపోయారు. అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో గ్రామసభ రసభాసగా మారింది. లిస్టులో తమ పేర్లు రాకపోవడంతో అనేకమంది నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చాలా చోట్ల పోలీసు బందోబస్తు మధ్య గ్రామసభలు నిర్వహిస్తున్నారు.