మణిపూర్ ఘటన అంశంతో అట్టడుకుతున్న పార్లమెంట్ ఉభయసభలు
ఇటీవల మణిపూర్‌లో మహిళలపై జరిగిన అమానవీయ ఘటన దేశానికే సిగ్గుచేటు అని చెప్పొచ్చు. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని తలదించుకునేలా చేసింది. అయితే ఈ నెల 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు మణిపూర్‌లో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. అయితే ఇవాళ మణిపూర్ ఘటనపై ప్రధాని ప్రకటన చేయాలని ప్రతిపక్షాల ఎంపీలు పట్టుబట్టారు. ఈ మేరకు ఎంపీలు పార్లమెంటులో తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. దీంతో ఇవాళ 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలను స్పీకర్ ఓం బిర్లా నిమిషాల వ్యవధిలోనే వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో కూడా మణిపూర్ అంశం, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌పై సస్పెన్షన్ వేటు వంటివి నిరసనలకు దారీ తీశాయి. దీంతో చైర్మన్ జగదీప్ ధన్‌కడ్ రాజ్యసభను వాయిదా వేశారు. కాగా ఈ మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని పట్టుబడుతున్న ఎంపీలు వెనక్కి తగ్గుతారని కేంద్రం భావించడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇక బిల్లుల్ని ప్రవేశ పెట్టే దానిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

