శిథిలాల కింద మరణాల మధ్య జననం
అతి శక్తివంతమైన భూకంప ధాటికి టర్కీ, సిరియా చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ప్రకృతి ప్రకోపానికి బలైన ఆ దేశాలలో ఇప్పటికే వేలాదిమంది కన్నుమూసారు. ఇంకా ఎంతమంది శిథిలాల క్రింద చిక్కుకున్నారో తెలియదు. అయితే భగవంతుని లీలలు మానవులకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులలో కూడా ఒక చిన్ని ప్రాణానికి ఊపిరిపోసాడు ఆ సృష్టికర్త. సిరియాలోని అలెప్పోలో శిథిలాల కింద చిక్కుకుని విలవిలలాడుతున్న ఓ గర్భిణి మహిళ తన అంత్యకాలంలో శిశువును ప్రసవించి కన్నుమూసిన విషాదఘటన జరిగింది. శిథిలాలు తొలగింపు ప్రక్రియలో భాగంగా స్థానికులు ఆమెను గమనించి, సహాయం అందించారు. ఆమె బిడ్డను కని వెంటనే చనిపోయింది. శిశువును వెంటనే వైద్యం కోసం తరలించారు. బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో చాలా వైరల్ అయ్యింది.