కేసీఆర్ ప్రకటనతో బీజేపీకి బూస్ట్..!
సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇస్తానన్న సీఎం కేసీఆర్ ప్రకటన తెలంగాణలో బీజేపీకి బూస్టింగ్‌గా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన టీఆర్‌ఎస్ నాయకులపై ఆయా నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పదేళ్ల పాటు పదవిని అనుభవించిన వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవాలనే ఆలోచనలో ఓటర్లు ఉన్నారు. మరోవైపు ఈసారి అయినా తమకు టికెట్ వస్తుందని ఆశతో ఉన్న టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు ఢీలా పడిపోయారు. సరిగ్గా ఈ వీక్ పాయింట్‌పైనే దెబ్బ కొట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. టికెట్ ఆశించి భంగపడిన టీఆర్‌ఎస్ నాయకులను తమ వైపునకు తిప్పుకునేందుకు కాషాయ దళ సభ్యులు పావులు కదుపుతున్నారు.

ఆపరేషన్ ఆకర్ష్‌కు ఇదే సమయం..
గత ఎన్నికల్లో ఓడిపోయిన జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి వంటి మాజీ మంత్రులు కూడా పక్క చూపులు చూసే పరిస్థితి తలెత్తింది. తెలంగాణ ఉద్యమంతో పాటు పార్టీలో ఎంతకాలం పని చేసినా చాకిరీ తప్ప పదవులు అనుభవించే అవకాశం లేదనే నిరాశతో ఉన్న టీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులతో సంప్రదింపులు ప్రారంభించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని ప్రారంభించేందుకు ఇదే సరైన సమయం అని కాషాయ నాయకులు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలు ఉండబోవని కేసీఆర్ చేసిన ప్రకటనతో చేరికలకు హడావుడి పడాల్సిన అవసరం లేదని.. ప్రజాదరణ కలిగి.. టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న నాయకులను చేర్చుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే.. నామినేటెడ్ పదవులిస్తానంటూ కొందరిని కేసీఆర్ బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.