చందా కొచ్చర్ దంపతులకు బాంబే హైకోర్టులో ఊరట..
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. వీరిని జైలు నుంచి విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. చట్టానికి అనుగుణంగా కొచ్చర్ దంపతులకు అరెస్టులు జరగలేదని బాంబే హైకోర్టు తెలిపింది. వీడియోకాన్ లోన్ ఫ్రాడ్ కేసులో వీరిని సీబీఐ డిసెంబర్ 23న వీరిని అరెస్ట్ చేసింది.
తమ అరెస్ట్ చట్ట విరుద్దమని, అవినీతి నిరోధక చట్టం ప్రకారం అవసరమైన అనుమతులను పొందకుండా తమను అరెస్ట్ చేశారని ఆరోపించారు. చందా కొచ్చర్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, అర్థం లేని దర్యాప్తు చేసి వారిని అరెస్ట్ చేశారన్నారు. కొచ్చర్ దంపతులు సీబీఐ నోటీసులకు సంపూర్ణంగా సహకరించారని, వారిని అరెస్ట్ చేసి ఉండకూడదని కొచ్చర్ తరపు న్యాయవాది అన్నారు. దీనిపై సీబీఐ న్యాయవాదులు స్పందిస్తూ.. కొచ్చర్ దంపతుల అరెస్ట్ విషయంలో చట్ట నిబంధనలను ఉల్లంఘించలేదని తెలిపారు.

సమన్లు జారీ చేసినపుడు దర్యాప్తునకు వీరు హాజరయ్యారన్నారు. అయితే.. తమ ప్రశ్నలకు తప్పించుకునే సమాధానాలు చెప్పడం సహకరించడం కాదని పేర్కొన్నారు. చందా కొచ్చర్‌ను అరెస్ట్ చేస్తున్నట్లు ఆమెకు మౌఖికంగా సమాచారం ఇచ్చామని, మహిళా కానిస్టేబుల్ ఆమెను తనిఖీ చేశారని తెలిపారు. జనవరి 15న తమ కుమారుని వివాహానికి హాజరయ్యేందుకు తమకు బెయిలు మంజూరు చేయాలని కొచ్చర్ దంపతులు దరఖాస్తు చేశారు. ఈ పిటిషన్లను పరిగణలోకి తీసుకోబోమని బాంబే హైకోర్టు గతవారం తెలిపింది. కొచ్చర్ దంపతుల అరెస్టులు చట్టానికి అనుగుణంగా జరగలేదని, అందువల్ల వారిని విడుదల చేయాలని ఆదేశించింది. ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల నగదు పూచీకత్తుపై వారిని విడుదల చేయాలని ఆదేశించింది. వీరి పాస్‌పోర్టులను దర్యాప్తు అధికారులకు అప్పగించాలని కోర్టు తెలిపింది.
