Home Page SliderNational

టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ‘బాలీవుడ్ భామలు’

‘పాన్‌ఇండియా’ ప్రభావంతో బాలీవుడ్ భామల కన్ను టాలీవుడ్‌పై పడింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాలకు అవార్డులు, రివార్డులు రావడం, వందలకోట్ల రూపాయలు వసూళ్లు సాధించడంతో తెలుగులో సినిమాల జోరు పెరిగింది. దీపికా పదుకొనె, జాన్వీకపూర్, మానుషి, నర్గిస్ వంటి బాలీవుడ్ భామలు తెలుగు సినిమాలలో బుక్కయ్యారు.

నిజానికి దీపిక కొంతకాలం కిందటి లవ్ 4 ఎవర్ అనే సినిమాలో ప్రత్యేక గీతంలో నటించింది. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. దీనితో ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీని దర్శకుడు మహానటి సినిమాకు దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణంలో ఉంది. ఇది రాబోయే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశాపటానీ కూడా నటిస్తున్నారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పే జాన్వీకపూర్ ‘ఎన్టీఆర్ 30’తో ఆయనతో నటించే అవకాశం దక్కించుకుంది. దీనికి కొరటాల శివ దర్శకుడు. సముద్రప్రాంతం బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ఇండియా  సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా రాబోతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘హరిహరవీరమల్లు’ చిత్రంలో నిధి అగర్వాల్, నర్గిస్ ఫక్రి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్య కథతో రాబోతున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియామూవీనే.

హర్యానాకు చెందిన 2017లో మిస్ యూనివర్స్ అయిన మానుషి చిల్లర్, యంగ్ హీరో వరుణ్‌తేజ్ హీరోగా రాబోతున్న సినిమాలో చిత్రానికి ఎంపికైంది. ఇది దేశభక్తి ప్రధాన చిత్రం అని సమాచారం. ఇప్పటికే తెలుగులో చాలమంది బాలీవుడ్ తారలు నటించి మెప్పించారు. సుస్మితాసేన్, కంగనా రనౌత్, కత్రినా కైఫ్, అలియాభట్ వంటివారు హీరోయిన్లుగా నటించగా, మలైకా అరోరా, ఊర్వశీ రౌతేలా ప్రత్యేకగీతాలలో అలరించారు.