బాలీవుడ్ నటుడుపై కత్తి తో దాడి…
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి నటుడి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ గాయపడగా కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అతడిని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. దొంగతో జరిగిన ఘర్షణలో నటుడికి ఆరో చోట్ల కత్తి గాయాలయ్యాయి. రెండు చోట్ల లోతుగా గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు.ఘటనపై నటుడి టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ప్రస్తుతం నటుడికి ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. ఈ విషయంపై అభిమానులు, మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నాం. ఇది పోలీసు కేసుకు సంబంధించిన వ్యవహారం. పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తాం’’ అని వెల్లడించింది.

