గల్లంతు అయిన తండ్రి, కూతురు మృతదేహాలు లభ్యం..
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. ప్రమాదంలో తండ్రి సోమరపు ప్రవీణ్ కుమార్ (39), కూతురు చైత్ర సాయి (5) గల్లంతయ్యారు. కుమారుడు సాయి వర్దన్ (3) మృతి చెందాడు. తల్లి విజయలక్ష్మిని తాడు సహాయంతో గ్రామస్తులు కాపాడారు. వీరంతా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన వారు. సోమరపు ప్రవీణ్ కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో వారి కారు ప్రమాదవశాత్తు పడిపోయింది. ప్రవీణ్ భార్య విజయలక్ష్మీని గ్రామస్తులు కాపాడగా కొడుకు అప్పటికే మృతి చెందాడు, కాలువలో గల్లంతైన తండ్రి, కూతురు కోసం గాలించారు. ఈ రోజు తెల్లవారుజామున గల్లంతు అయిన తండ్రి, కూతురు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

