తిరుమల పాపవినాశనంలో బోటింగ్ కలకలం..
కలియుగ వైకుంఠం తిరుమలలోని పవిత్ర తీర్థం పాపవినాశనంలో మంగళవారం బోటింగ్ కలకలం రేపింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో పాపవినాశనంలో బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. కుమారధార, పసుపుధార నీరు మొత్తం పాపవినాశనంలోనే చేరుతుంది. టీటీడీకి చెందిన పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం కూడా ఇక్కడే ఉన్నాయి. దీనితో భక్తులు మండిపడుతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చే ప్రయత్నాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై అటవీ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ ప్రాంతం నుండి బాలపల్లి, చిట్వేల్ అటవీ ప్రాంతం వరకూ బయోస్పియర్ సరిహద్దులు ఉన్నాయని, ఇక్కడ ఎకోటూరిజం అభివృద్ధి అవకాశాలను మాత్రమే పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇంతటి పుణ్యక్షేత్రం వద్ద ఎలాంటి కార్యక్రమం చేసినా, భక్తుల విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని అనుమతులు లభిస్తేనే ముందుకెళతామన్నారు.

