Home Page SliderTelangana

బీజేపీలో చేరిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్

బీజేపీలో చేరిన బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల ముఖ్యనేతలు
గిరిజనులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు. అందుకే పార్టీ వీడా- రాథోడ్ బాపూరావ్
లిక్కర్ మాఫియాకు, అవినీతి నాయకులకే కేసీఆర్ టికెట్లు ఇచ్చారన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది.. బీజేపీవైపే ప్రజలుచూస్తున్నారని వెల్లడి
కర్ణాటకలోని కాంగ్రెస్ పారిశ్రామిక వేత్తలనుంచి ‘తెలంగాణ ఎలక్షన్ టాక్స్’ వసూలు చేస్తోంది
కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా.. ఆర్థిక వ్యవస్థను అంధకారంలోకి నెట్టేస్తోంది.
తెలంగాణ ప్రజలు వాస్తవాలను అర్థంచేసుకోవాలన్న కిషన్ రెడ్డి

అవినీతిని ప్రోత్సహించే టీఆర్ఎస్ పార్టీ..అవినీతిపరులు,లిక్కర్ మాఫియాకు పాల్పడేవారికే టికెట్లు ఇచ్చిందని కేంద్రమంత్రి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని.. ఈ నేపథ్యంలో ప్రజలంతా ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపే చూస్తున్నారని ఆయన అన్నారు. బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి నివాసంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే (బోథ్) రాథోడ్ బాపూరావ్ తో పాటుగా.. మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెల్లమల కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సుభాష్ రెడ్డి, ఇతర నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న రాథోడ్ బాపూరావ్, ఇవాళ బీజేపీలో చేరడం.. గిరిజన ప్రాంతాల్లో, ఆదిలాబాద్ వంటి వెనుకబడిన ప్రాంతాల్లోనూ బీజేపీకి పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని అన్నారు. ఒకటోతేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని నెట్టేసిన కేసీఆర్ కు సరైన బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలను కోరారు.

అటు కర్ణాటకలో హామీల అమలులో.. వైఫల్యం చెందిన కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ తెలంగాణలో హామీల పేరుతో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన 5 నెలలుగా.. రాష్ట్రంలో.. ‘తెలంగాణ ఎలక్షన్ టాక్స్’ పేరుతో అక్కడి పారిశ్రామికవేత్తలనుంచి డబ్బులు వసూలు చేస్తోందని ఆయన అన్నారు. ఆ డబ్బునే ఇక్కడ ఎన్నికల్లో ఖర్చుకోసం వినియోగిస్తోందన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశంలో విలువలు కలిగిన రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చే బీజేపీ వైపు నాయకులు, ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ డబ్బులు కుమ్మరిచ్చి ఎన్నికల్లో గెలుద్దామని చూస్తుందని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇలాంటి ఆలోచనలకు సరైన బుద్ధి చెబుతారని లక్ష్మణ్ అన్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో.. గిరిజన ఎమ్మెల్యేలను అవమానించేలా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని.. రాథోడ్ బాపూరావ్ వంటి సౌమ్యుడు, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తికి కేసీఆర్ దర్బార్ లో గుర్తింపు దక్కనందునే.. వారు బీజేపీలో చేరారన్నారు. ఇది కల్వకుంట్ల కుటుంబ అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రజలను ఆకర్షించే ఎన్నికల మేనిఫెస్టో కన్నా.. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించే మేనిఫెస్టోపైనే బీజేపీ దృష్టి సారిస్తుందన్నారు. త్వరలోనే బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని ఆయన అన్నారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి… బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రికి ఫూజల ద్వారా గెలవాలని ప్రయత్నిస్తున్నారని.. కానీ ప్రజా సంక్షేమం కోసం చేసే పూజలే సత్ఫలితాలను ఇస్తాయని.. ఇతరులు మునిగిపోవాలని చేసే పూజలకు ఫలితం ఉండదన్నారు. జన వశీకరణ కోసం పూజలు చేయడమే సీఎం ఆలోచన అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తన ఆలోచన ఫలితమే అని ఘనంగా చెప్పుకున్న కేసీఆర్.. ఇప్పుడు మేడిగడ్డ బ్రిడ్జి కుంగిపోతే ఎందుకు మాట్లాడటం లేదన్నారు. తాజాగా అన్నారం బ్యారేజీకి కూడా పగుళ్లు ఏర్పడుతున్నట్లుగా వస్తున్న వార్తలతో.. ప్రజల్లో ఆందోళన నెలకొందని.. దీనిపై ముఖ్యమంత్రి, కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. దీన్ని చిన్న విషయంగా.. కొట్టిపారేస్తున్న ట్విట్టర్ టిల్లు.. లక్షల కోట్ల ప్రజాధనాన్ని వ్యర్థం చేసిన సందర్భంలో ఒక్క మాట ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా.. వేలకోట్ల ఇసుక ధందాలకు పాల్పడిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీలదని ఆయన అన్నారు.

ఈటల రాజెందర్ గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకూ కేసీఆర్ పై వ్యతిరేకత పెరిగిపోతోందని.. కేవలం బీజేపీ ద్వారానే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. చంద్రబాబును అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటోందని.. తెలంగాణ ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండిస్తారన్నారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం తథ్యమన్నారు. వ్యక్తులు అటు ఇటు మారుతూ ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం నిశ్చితాభిప్రాయంతో ఉన్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావద్దు.. మళ్లీ కెసిఆర్ అధికారంలోకి వస్తే ప్రజలు బ్రతికి బట్టి బట్టకట్టరు.. అనే అభిప్రాయంతో ఉన్నారన్నారు. అనేక సంవత్సరాలుగా అనేక విషయాల మీద అదరగొట్టిన కేసీఆర్ కాళేశ్వరం మీద సమాధానం చెప్పడం లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఎలా మోసం చేశారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పార్టీల్లోకి చేరికలు, జంపింగ్ లు సాధారణమని.. కానీ నీతి, నిబద్ధత కలిగిన బీజేపీ పార్టీ పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందని ఆమె అన్నారు. ఎవరైనా బీజేపీలో చేరాలనుకుంటే.. రాజీనామా చేసిన తర్వాతే చేరాలన్న బీజేపీ నిబద్ధతను, నీతి, నిజాయితీలను ప్రజలు స్వాగతిస్తారని ఆమె అన్నారు. బీజేపీలో చేరిన సందర్బంగా.. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ మాట్లాడుతూ.. ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ ఉద్యమంలో చేరి.. రాష్ట్ర సాధనకోసం తనవంతు ప్రయత్నం చేశానన్నారు.

రెండుసార్లు గెలిచిన తనను, ప్రజల్లో ఆదరాభిమానాలున్నప్పటికీ.. కొంతరు కక్షగట్టి మూడోసారి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారన్నారు. దీనిపై మాట్లాడాలని కలిసేందుకు ప్రయత్నిస్తే.. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని రాథోడ్ బాపూరావ్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు గిరిజన ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. బోథ్ లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోయం బాపూరావ్ విజయానికి కృషిచేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మోదీ పాలనపట్ల ప్రజల్లో సానుకూలత ఉందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని బాపూరావ్ అన్నారు. అనంతరం ఎల్లారెడ్డికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సుభాష్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెల్లమల కృష్ణారెడ్డితోపాటు.. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సురిగి నర్సింహా, బిట్టు సత్యనారాయణ పార్టీలో చేరారు. వీరందరినీ కిషన్ రెడ్డి గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.