టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం, టీజేఎస్ విద్యార్థి విభాగాలు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పరీక్ష పేపర్ లీక్ కేసు వ్యవహారమై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. మార్చి 5 న జరిగిన పరీక్షకు ప్రశ్నపత్రం లీక్ అయిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న TSPSC అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇద్దరు అభ్యర్థులు, TSPSC సెక్రటరీకి PA సహా దాదాపు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో దోషులందిరినీ అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలంటూ బీజేవైఎం ఇవాళ నాంపల్లి TSPSC కార్యాలయాన్ని ముట్టడించింది. బీజేవైఎం కార్యకర్తలు గేట్లెక్కి నిరసన తెలిపారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. తక్షణం టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయం గేటు వద్ద బైఠాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకొంది.

మరోవైపు తెలంగాణ జనసమితి టీజేఎస్ విద్యార్థి విభాగం సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ బోర్డు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. గోడెక్కి గేటు వద్ద ఉన్న టీఎస్పీఎస్సీ బోర్డును చించేశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, పేపర్ లీకేజీపై విచారణకు కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలను అమ్ముకుని నిరుద్యోగుల జీవితాలతో టీఎస్‌పీఎస్సీ నాశనం చేస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ వార్తలతో… టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ పోస్టుకు మార్చి 12న జరగాల్సిన పరీక్ష పేపర్ లీక్ అయిందన్న అనుమానంతో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మార్చి 12న జరగాల్సిన రాత పరీక్షను శనివారం TSPSC వాయిదా వేసింది.