స్టాలిన్ సర్కారుపై బీజేపీ యుద్ధం, లక్షా 34 వేల కోట్ల డీఎంకే ఫైల్స్ రిలీజ్
సీఎం ఎంకె స్టాలిన్ కుమారుడు, క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో సహా కీలకమైన డీఎంకే నేతలకు చెందిన ₹ 1.34 లక్షల కోట్ల విలువైన ఆస్తుల జాబితాను తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై “డిఎంకె ఫైల్స్” పేరుతో రిలీజ్ చేశారు. బీజేపీ చీఫ్ విడుదల చేసిన జాబితాలో మంత్రులు దురై మురుగన్, ఈవీ వేలు, పొన్ముడి, సెంథిల్ బాలాజీ, కేంద్ర మాజీ మంత్రి జగత్రక్షకన్ ఉన్నారు. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు 2011 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెన్నై మెట్రో రైలు కాంట్రాక్టును దక్కించుకునేందుకు ఒక కంపెనీకి అనుకూలంగా వ్యవహరించినందుకు రెండు వందల కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ అన్నామలై ఆరోపించారు. షెల్ కంపెనీల ద్వారా చెల్లింపులు జరిగాయని ఆరోపించారు. లంచం బాగోతంపై అమెరికా కంపెనీ దర్యాప్తు చేస్తోందన్నారు. డీఎంకే నేతలు చాలా మంది తమ ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల వివరాలను వాస్తవ ఆస్తులను కూడా ఆయన ప్రస్తావించారు.
వాస్తవానికి ఈ మొత్తం వ్యవహారానికి అసలు కారణం, అన్నామలై ధరించిన వాచ్ అని తెలుస్తోంది. ఖరీదైన, వివాదాస్పదమైన, డస్సాల్ట్ వాచ్ ఎలా కొనుగోలు చేశారంటూ విమర్శల నేపథ్యంలో అన్నామలై డీఎంకేను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మే 2021లో తన స్నేహితుడు చెరలతన్ నుండి మూడు లక్షల రూపాయలకు డస్సాల్ట్ వాచ్ కొన్నానని చెప్పారు. ఐతే వాచీ కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఆధారం సమర్పించలేదు. దీంతో తమిళనాడు విద్యుత్ మంత్రి సెంథిల్ బాలాజీ కొన్ని నెలల క్రితం ఈ వాచ్ కొనుగోలుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి తనను రెచ్చగొట్టడం వల్లే తాజాగా తమిళనాడు మంత్రులు ఆస్తుల వివరాలను అన్నామామలై బహిర్గతం చేశారని తెలుస్తోంది. తనకు నెలకు ఏడెనిమిది లక్షల ఖర్చు ఉంటుందని.. స్నేహితుల సాయంతో నెల వారీ చెల్లింపులు జరుపుతానన్న ఆయన, తన ఇంటి అద్దె సైతం స్నేహితులు చెల్లిస్తారని చెప్పారు. తనకు రాజకీయాలు ఒక సవాలని ఆయన చెప్పుకొచ్చాడు.
అన్నామలై ఆరోపణలపై డీఎంకే మండిపడింది. అన్నామలై విమర్శలు పెద్ద జోక్ అంటూ కొట్టిపారేశారు ఆ పార్టీ ఎంపీ ఆర్‌ఎస్ భారతి. డీఎంకే నేతలు లంచాలు తీసుకున్నట్టు ఒక్క ఫిర్యాదు కూడా ఇప్పటి వరకు లేదని… అభ్యర్థులందరూ అఫిడవిట్‌లలో ఆస్తుల వివరాలు పొందుపరిచారని, ఒక్క ఉల్లంఘన జరిగినా, ప్రజలు ఎవరైనా ఆ ఎన్నికను సవాలు చేయవచ్చన్నారు. దశాబ్దాల క్రితం 87 కోట్లతో ఎల్‌ఐసి భవనం నిర్మించారని ఇప్పుడు దాని విలువ వేల కోట్లని ఎంపీ భారతి చెప్పారు. అన్నామలై విమర్శలపై పార్టీ నాయకులు కోర్టును ఆశ్రయిస్తారని.. ఆయన విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు. 200 కోట్ల లంచం ఆరోపణలు రుజువు చేసేందుకు తమపై కేసులు పెట్టాలని బీజేపీ చీఫ్‌కు, భారతి సవాల్ విసిరారు.

అదానీపై హిండెన్‌బర్గ్ నివేదిక, ఆరుద్ర కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకు అన్నామలై ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చెన్నై మెట్రో రైలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ 2014 నుంచి ఏం చేస్తోందని ప్రశ్నించారు. అన్నామలై ఆరోపణలు ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 40 ఎంపీ స్థానాలను డీఎంకే గెలుస్తోందని భారతి చెప్పారు. 15 రోజుల్లో డీఎంకే యాజమాన్యంలోని పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని అన్నామలైని ఆయన డిమాండ్ చేశారు.

