NationalNews

కంచుకోటల్లో బీజేపీకి అగ్ని పరీక్ష..!

మోగిన హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల నగారా.. త్వరలో గుజరాత్‌

రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో కొనసాగుతున్న బీజేపీ

ఆప్‌ కొత్త సవాలు.. త్రిముఖ పోటీతో బీజేపీకి లాభం

బీజేపీకి కంచుకోట అయిన హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనుంది. దేశాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షా గుజరాత్‌ నుంచి వచ్చిన వారే. గుజరాత్‌ మోడల్‌ను దేశవ్యాప్తం చేస్తామంటూ దేశ ప్రజల మనసు చూరగొన్న మోడీ-షా ద్వయానికి గుజరాత్‌ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలపై దేశ ప్రజల దృష్టి కేంద్రీకృతమైంది. దీంతో ఈ రాష్ట్రాల్లో విజయం బీజేపీకి తప్పనిసరిగా మారింది.

గుజరాత్‌ మోడల్‌ కొనసాగాలంటే..

దేశ ప్రజలు ఇప్పటికే ఆమోదించిన గుజరాత్‌ మోడల్‌ పట్ల వారి విశ్వాసం సన్నగిల్లకుండా ఉండాలంటే ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిందే. ఈ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన మోడీ.. ప్రధానిగా ఎదిగేందుకు గుజరాతే సోపానంగా మారింది. అందుకే ఈ రాష్ట్రం మోడీకి మానస పుత్రికగా నిలిచింది. 10 రోజుల్లోనే రెండుసార్లు గుజరాత్‌లో పర్యటించిన మోడీ రాష్ట్రంలో 80 వేల కోట్ల రూపాయలతో పలు ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను, అహ్మదాబాద్‌ మెట్రో రైల్‌ ఫేస్‌-1ను ప్రారంభించారు. ప్రధాని మూడు రోజులు గుజరాత్‌లోనే మకాం వేసి సబర్మతి-జగుడన్‌ స్టేషన్ల మధ్య గేజ్‌ మార్పిడి, నందసన్‌ జియోగ్రాఫికల్‌ ఆయిల్‌ ప్రొడక్షన్‌ ప్రాజెక్టు, సుజలాం సఫలాం కెనాల్‌, ధరోహి డ్యామ్‌ ప్రాజెక్టు, మొధెరా ఛనస్మా రహదారి విస్తరణ పనులు సైతం ప్రారంభించారు.

ఆప్‌ ముమ్మర ప్రచారం..

1995 నుంచి రెండేళ్లు మినహా సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న బీజేపీ పట్ల గుజరాత్‌ ప్రజల్లో ఈసారి కొంత అసంతృప్తి నెలకొన్నదన్న వార్తలొచ్చాయి. మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ చాపకింద నీరులా దూసుకెళ్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా.. గుజరాత్‌లోనే మకాం వేసి అన్ని జిల్లాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఆప్‌ హామీల వర్షం కురిపిస్తోంది. 2017లో పటేల్‌ కోటా రిజర్వేషన్లు బీజేపీ విజయానికి సోపానంలా నిలిచాయి. ఈసారి గుజరాత్‌ గౌరవ్‌ యాత్రతో ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌, ఆప్‌లతో జరిగే త్రిముఖ పోటీలో విజయం సాధిస్తామనే ధీమాలో బీజేపీ నేతలు ఉన్నారు. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో 2017లో బీజేపీ 99 స్థానాలు, కాంగ్రెస్‌ 77 స్థానాలు సాధించాయి.

ప్రారంభోత్సవాలతో మోడీ బిజీ..

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సొంత రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ బీజేపీని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇబ్బంది పెడుతోంది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో పేపర్‌ లీక్‌ విషయం బీజేపీ సర్కారుకు తలనొప్పిగా మారింది. దీనిపై ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించినా రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా లేరని వార్తలొస్తున్నాయి. నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలను ఆప్‌ అస్త్రంగా వాడుకుంటోంది. దీంతో ఆ రాష్ట్రంలోనూ మోదీ విస్తృతంగా పర్యటిస్తూ వేలాది కోట్లతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ఉనాలో ట్రిపుల్‌ ఐటీతో పాటు ఫార్మా, విద్య, కనెక్టివిటీ ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. చంబాలో రెండు జల విద్యుత్తు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మహార్యాలీ ద్వారా కాంగ్రెస్‌ ప్రచారాన్ని ప్రియాంక గాంధీ ప్రారంభించారు. 68 స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో 2017లో ఎన్డీయేకు 44 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్‌ 21 స్థానాల్లో గెలిచింది.